హైటెక్ పద్దతిలో ఏపీ కేబినెట్ భేటీ

Sunday, September 14th, 2014, 11:09:47 PM IST


సోమవారం ఏపీ కేబినెట్ భేటీ దేశంలోనే తొలి పేపర్ లెస్ కేబినెట్ మీట్ గా రికార్డులకు ఎక్కనుంది.హైటెక్ చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఏపీ మంత్రివర్గ సమావేశానికి మంత్రులందరూ ఫైళ్ళూ పత్రాలేవీ లేకుండా కేవలం ఐ ప్యాడ్లతో హాజరు కానున్నారు. మంత్రివర్గ ఎజెండా కూడా మంత్రులకు ఐ ప్యాడ్‌లోనే అందనుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇంతవరకూ ఈ పద్దతిలో జరగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కేబినెట్ సమావేశం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పేపర్లు, డాక్యుమెంట్లు, సంతకాల తతంగాలు. మంత్రులకు వివిధ నోట్స్, ప్రింటింగ్ మెటీరియల్స్ అందచేసే సిబ్బంది హడావిడి. అయితే సోమవారం జరిగే ఏపీ కేబినెట్ భేటీలో ఇలాంటివేమీ కనిపించవు. పెన్నూ, పేపర్ ల ఊసే ఉండదు. దేశంలోనే తొలిసారిగా ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో డిజిటల్ కేబినెట్ బేటీ జరగనుంది. మంత్రులంతా ఈ సమావేశానికి కేవలం ఐప్యాడ్స్ తోనే హాజరవనున్నారు.

ఈ సమావేశం కోసం ఏపీ ఐటీ శాఖ విస్తృతమైన కసరత్తు చేసింది. ప్రతి మంత్రికి ఒక ఐప్యాడ్‌ అందచేశారు. ఈ క్యాబినెట్‌ పేరుతో అభివృద్ధి చేసిన ఒక ప్రత్యేకఅప్లికేషన్‌(యాప్‌)ను మంత్రుల ఐప్యాడ్లలో ఇన్‌స్టాల్‌ చేశారు. ఈ యాప్‌ ద్వారా మాత్రమే క్యాబినెట్‌ ఎజెండాకు సంబంధించిన సమాచారం మంత్రుల ఐప్యాడ్లలో తెరుచుకొంటుంది. కేవలం మంత్రులకు ఇచ్చిన ఐప్యాడ్లలో మాత్రమే ఈ యాప్‌ ఉండేలా జాగ్రత్త తీసుకొన్నారు. ప్రభుత్వం మంత్రులకు పంపే సమాచారం రక్షణకు కూడా ఈ ఐప్యాడ్స్‌లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 128 బిట్‌ ఎన్‌క్రిప్షన్‌తోపాటు వర్ట్యువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ను ఇందుకోసం ఏర్పాటు చేశారు. ఇందులో ఈ క్యాబినెట్‌ పేరుతో ఫైల్‌ షేరింగ్‌ సిస్టం ఉంటుంది. దీనిని ఎవరెవరు చూస్తున్నారన్నది ఐటీ శాఖ పర్యవేక్షించే అవకాశం ఉంది. పొరపాటున ఫైళ్ళు డిలీట్‌ అయినా మళ్ళీ చేర్చే సదుపాయం పెట్టారు.

ప్రస్తుతం 30 మంది దీనిని వినియోగించుకొనే అవకాశం ఉంది. కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని మంత్రులు వినియోగించుకొనేలా అలవాటు చేయడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని చేపట్టారు. గతంలో మంత్రులకు పంపే క్యాబినెట్‌ ఎజెండా భారీగానే ఉంటుంది. మంత్రివర్గ సమావేశం ముందు చర్చకు వచ్చే వివిధ అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటిపై ప్రభుత్వ శాఖల వివరణలు, నివేదికలు వంటివన్నీ గతంలో ముద్రించి మంత్రులకు ముందుగా అందజేసేవారు. కొన్నిటిని అప్పటికప్పుడు మంత్రివర్గ సమావేశం సమయంలో అందజేసేవారు. ఇప్పుడు ముద్రణను పూర్తిగా ఎత్తివేశారు.

అయితే ఇక మంత్రులు ఈ సమాచారం అంతా ముందుగా తమ ఐప్యాడ్లలలోనే పరిశీలించి సమావేశానికి రావాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై మంత్రులకు అవగాహన ఉంటే, వారు తమ శాఖల్లో కూడా దాని వినియోగాన్ని ప్రోత్సహించి, ప్రభుత్వ పనితీరు మెరుగుపరుస్తారని సీఎం ఆశిస్తున్నట్టు సమాచారం.