రాజధాని.. ఆకాశహర్మ్యాల నగరం

Wednesday, September 24th, 2014, 02:43:40 AM IST


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరంలో భారీ ఆకాశహార్మ్యాలను నిర్మించాలని బాబు సర్కార్‌ వ్యూహరచన చేస్తోంది. రాజధానిలోని చాలా భవనాలు కనీసం 44 అంతస్థులు కలిగి ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయా భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ రెండు మార్గాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

ఆకాశహార్మ్యాలను నిర్మించి వాటిని మొత్తంగా ప్రభుత్వం తీసుకోవడం ఒకటైతే, వాటిలోనే రైతులకు, రాజధాని నిర్మాణ సంస్థకూ భాగస్వామ్యం ఇవ్వడం రెండోది. ఆయా భవనాలను మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటే రైతులు, బిల్డర్లకు ప్రభుత్వం మరొకచోట కమర్షియల్‌గా భవనాలను నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వనుంది. అక్కడ రైతులు, బిల్డర్లు కూడా 44 అంతస్థుల్లో ఆకాశహార్మ్యాలన నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.

అయితే, విజయవాడ పరిసరాలు సీస్మిక్‌ జోన్‌ మూడులోకి వస్తాయంటూ పలువురు చేస్తున్న వాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, విజయవాడ పరిసరాల్లో ఇప్పటి వరకూ భూకంపాలు రాకపోవడాన్ని వివరిస్తూనే, అసలు రాజధాని ప్రాంతం సీస్మిక్‌ జోన్‌లోనే లేదని నిపుణులు చెబుతున్నారు.