అసెంబ్లీలో బీజేపీ పై చంద్రబాబు ఉగ్రరూపం..!

Thursday, September 20th, 2018, 01:56:57 AM IST

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నడూ చూడని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఉగ్ర రూపాన్ని చూపించారు.అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిమిత్తం ఏడవ రోజు అనగా ఈ రోజు చంద్రబాబు బీజేపీ లీడర్ విష్ణు కుమార్ రాజు మీద విరుచుకుపడ్డారు.ఈ సమావేశంలో విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ తాను ఆంధ్రుడినని ఆంధ్రప్రదేశ్ తర్వాతనే తమ పార్టీ అని మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా న్యాయం చేకూర్చిందని.భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని చట్టంలో ఉందని,అప్పుడు ఇస్తామన్నటువంటి ప్రత్యేక హోదా స్థానంలో దానికి సమానమైన సుమారు పదహారువేల ఏడ వందల కోట్లుతో ఆర్ధిక సాయం చేస్తాం అని ప్రకటించాము అని తెలుపుతుండగా చంద్రబాబు గారు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారని?మీ పార్టీ వారు ఢిల్లీలో మాట్లాడిన మాటలు మీరు ఇక్కడ మాట్లాడితే అది మంచిది కాదని.ప్రత్యేకహోదా వచ్చినట్టయితే కేంద్రం నుంచి వచ్చే నిధులలో 90% మనకు వస్తాయని,ఎన్నో పరిశ్రమలు కూడా వస్తాయని,అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపినపుడు ఇవ్వడానికి మీకు ఉన్న అభ్యంతరం ఏమిటి అని గట్టిగ అడిగారు.ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే మీకు ఎందుకని ఇంత వివక్షత ఉంది అని,మేమంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నామా?,లెక్కలేనితనమా?ఏమి చెయ్యలేరు అని చిన్న చూపా? అని గర్జించారు.ఇంకా మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవాలి అని చూస్తే ప్రజలు క్షమించరు అని,రాష్ట్రం విభజన పట్ల చాలా కోపంలోను ఆవేశంలోను ఉన్నామని,అలాంటప్పుడు చిన్న తప్పిదం జరిగినా సరే క్షమించే ప్రసక్తే లేదని,అలాగే ఈ రాష్ట్రానికి అన్యాయం చెయ్యాలని చూసే ఎవ్వరైనా వారికి అండగా ఉండేది ఎంతటి వారైనా భవిష్యత్తులో వారిని క్షమించే సమస్యే లేదని దాన్ని జరగనివ్వనని అత్యంత ఆవేశంగా మాట్లాడారు.