రాజ‌ధాని మున‌క‌లేయాల‌ని ప్ర‌తిప‌క్షాల కుట్ర‌!

Tuesday, September 18th, 2018, 03:58:53 PM IST

రాజ‌ధాని మునిగిపోవాల‌ని ప్ర‌తిప‌క్షాలు కుట్ర చేశాయా? అంటే అవున‌నే ఆరోపించారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. రాజ‌ధాని న‌గ‌రానికి వ‌ర‌ద‌నీటి ముప్పు లేకుండా అడ్డు క‌ట్ట వేసేందుకే కొండ‌వీడు వాగుపై ఎత్తిపోత‌ల ప్రాజెక్టు నిర్మించామ‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌లే ఈ ప‌థ‌కాన్ని అధికారికంగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దీనివ‌ల్ల రాజ‌ధానికి భ‌విష్య‌త్‌లో వ‌ర‌ద‌నీటి ముప్పు ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డించారు. నేడు మీడియా ముఖంగా మాట్లాడిన ఏపీ సీఎం చాలా విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

కొండవీడు వాగు ద్వారా చాలా గ్రామాలు ముంపునకు గురయ్యేవి. కానీ ఇది గతం. భవిష్యత్తులో ముంపు బాధే ఉండకుండా చేశాం. రాజధాని కోసం రైతులు త్యాగం చేస్తే.. కొందరు నేతలు మాత్రం విషం చిమ్ముతున్నారు. అదొక్క‌టే కాదు.. రాజధాని మునిగిపోవాలని ప్రతిపక్ష నేతలు కోరుకుంటున్నారు. మాపై విష‌యం చిమ్ముతున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. భూమి రైతుల వద్ద ఉండగానే లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఇష్టానుసారంగా మాట్లాడార‌ని సీరియ‌స్ అయ్యారు.

నీటి ప్రాజెక్టుల‌పై వివ‌ర‌ణ ఇస్తూ.. ఒకే రోజు ఒక టీఎంసీల నీరొచ్చినా ముంపును తట్టుకునేలా కొండవీటి వాగు లిఫ్ట్ నిర్మించాం. జీవితంలో ఎన్నడూ పెట్టనంత శ్రద్ధ ఇరిగేషన్ శాఖపై పెట్టాను. భవానీ దీక్షలు, అయ్యప్ప దీక్షల తరహాలో నేను జల దీక్ష చేపట్టాను. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన మూడు రాష్ట్రాలు దాటుకుని ఏపీకి నీరు చేరాల్సి ఉంటుంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను ఆదుకోగలిగాం. పట్టిసీమ ద్వారా డెల్టాకు నీరిచ్చాం… శ్రీశైలం ద్వారా కరవు సీమకు నీళ్లిచ్చామ‌ని అన్నారు. 57 ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం.. వీటిల్లో 12 ప్రాజెక్టులు పూర్తి చేశాం. మిగిలిన ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామ‌ని అన్నారు. గతంలో జల యజ్ఞ‌ అని ధన యజ్ఞ‌ చేశారు. నదుల అనుసంధానం పూర్తి అయితే.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు అనుసంధానం కానున్నాయ‌ని అన్నారు. నీరు లేక నష్టపోయామనే మాట రైతు నోటి వెంబడి రాకుండా.. ఇరిగేషనుకు ప్రాధాన్యతనిస్తున్నామ‌ని, గుంటూరు ఛానల్ కోసం రూ. 384 కోట్ల కేటాయిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. నాగార్జున సాగర్ 12 ఏళ్లు.. శ్రీశైలం 22 ఏళ్ల పాటు నిర్మించారు. పోలవరానికి మాత్రం 4 ఏళ్లల్లో రూపు తీసుకురాబోతున్నాం. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ. 2500 కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. బాబు ప్ర‌క‌టించిన‌వ‌న్నీ వాస్త‌వాలే అయితే, కార్య‌రూపం దాలిస్తే అది ఏపీ ప్ర‌జ‌ల‌కు నిజంగా మేలే. అయితే ప్రాజెక్టుల్లో అవినీతిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ బాబు మాట‌ల్ని ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అన్న‌ది వేచి చూడాలి. వీట‌న్నిటికీ వ‌చ్చే ఎన్నిక‌లే స‌మాధానం కాబోతున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.