బాబు ధర్మ పోరాట దీక్ష నేడే

Friday, April 20th, 2018, 04:05:41 AM IST

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన జన్మదినం రోజున ‘ధర్మ పోరాట దీక్ష’ పేరిట నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడింటి వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆయన ఈ దీక్ష చేపడుతున్నారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చేస్తున్న పోరాటంలో భాగంగా చంద్రబాబు నిరశనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించకుండా, దీక్షల ద్వారా అందరూ కేంద్రంపై ధర్మాగ్రహం ప్రకటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఒక నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం పుట్టిన రోజున నిరాహారదీక్ష చేయడం ఇదే ప్రథమం. 68ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ముఖ్యమంత్రికి సంఘీభావంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహించనున్నాయి. ఏ జిల్లాకు చెందిన మంత్రుల్ని ఆ జిల్లాలోనే దీక్షల్లో పాల్గొనాల్సిందిగా సూచించారు.
జనావళికి ‘చంద్ర’లేఖ…
దీక్ష నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు లేఖ రాశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తున్నాను’’ అని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పోరాటానికి కలసి రావాలని, దీక్షలో పాల్గొనాలని కోరుతూ అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, సంస్థలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కె.కళావెంకటరావు లేఖలు రాశారు. వైకాపా, భాజపా, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు సహా అన్ని పార్టీలకూ, సంఘాలకు ఈ లేఖలు వెళ్లాయి. ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్లుచేసి సమాచారం అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వాణిజ్య సంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ సంస్థలు, యూనియన్లు ముఖ్యమంత్రి దీక్షకు మద్దతు ప్రకటించాయి. రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున దీక్షకు హాజరవనున్నారు.

మతపెద్దల ఆశీర్వచనాలతో శ్రీకారం..
ఉదయం ఏడింటికి ముఖ్యమంత్రి దీక్ష మొదలవుతుంది. ముఖ్యమంత్రి వేదికపైకి రాగానే తితిదే, దుర్గగుడికి చెందిన వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు ఆశీర్వచనాలు అందజేస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారు. మాజీ సైనికులు ముఖ్యమంత్రిని కలసి సంఘీభావం ప్రకటిస్తారు. శుక్రవారం సాయంత్రం ఏడింటికి దీక్ష విరమించాక ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీక్షకు సంఘీభావంగా హాజరైన వివిధ పార్టీలు, సంఘాల నాయకులతో మాట్లాడిస్తారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, సీనియర్‌ నేత వర్ల రామయ్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. కళావెంకటరావు సారథ్యంలోని మంత్రివర్గం ఉపసంఘం మొత్తం సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తుంది

  •  
  •  
  •  
  •  

Comments