పెట్టుబడులు పెట్టండి లాభాలను పొందండి : ఏపీ సీఎం చంద్రబాబు

Saturday, April 14th, 2018, 09:03:22 AM IST

అమరావతికి ప్రభుత్వ అతిథులుగా వచ్చి ఇక్కడ అభివృద్ధిని చూడాలని సింగపూర్‌లోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు. అభివృద్ధిని చూసి పెట్టుబడులు పెడితే అది మీకూ, మాకూ ఉభయతారకంగా ఉంటుందన్నారు. మీకు లాభాలు, మాకు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ, హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, ఆగ్రోప్రాసెసింగ్‌ వంటి రంగాల్లోను, ఓడరేవులు, విమానాశ్రయాలు, అంతర్గత జల రవాణా వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లోను పెట్టుబడులకు విశేషమైన అవకాశాలున్నాయని వివరించారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తిగానీ, ఆకాంక్షగానీ తనకు లేదని, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 53 శాతం పూర్తయ్యాయని 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకీ కొంత మేర జలాలు సరఫరా చేయగలమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం సింగపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి… ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాల్లో తీరికలేకుండా గడిపి వివిధ వేదికలపై మాట్లాడారు. ఉదయం 5.30 నుంచే కార్యక్రమాలు మొదలయ్యాయి. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌, టాటా సన్స్‌ బోర్డు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, సింగపూర్‌ రాయబారి గోపీనాథ్‌ పిళ్లైలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హిందుస్థాన్‌ టైమ్స్‌ (హెచ్‌టీ) సంస్థ నిర్వహించిన ‘హెచ్‌టీ-మింట్‌ ఆసియా లీడర్‌షిప్‌ సమ్మిట్‌’లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుతో హెచ్‌టీ ఎడిటర్‌ ఆర్‌.సుకుమార్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో సింగపూర్‌ ఉప ప్రధాని థర్మన్‌ షణ్ముగరత్నం తదితరులు పాల్గొన్నారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుల పురోగతి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, తాజా రాజకీయాలు… ఇలా పలు అంశాలపై సుకుమార్‌, సభికులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందా? అన్న ప్రశ్నకు… ‘‘అది చర్చించడానికి ఇది వేదిక కాదు. దానిపై భారత్‌లో మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం చెప్పాలి. పురోగామి రాష్ట్రాల్ని ప్రోత్సహించాలే తప్ప శిక్షించకూడదు. దాని వల్ల వాటి సామర్థ్యం దెబ్బతింటుంది’’ అని బదులిచ్చారు. ఈ సదస్సులో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.