ఏపీ సర్కార్ కీలక ఒప్పందాలు ఇవే..!

Monday, September 29th, 2014, 10:02:31 PM IST


విశాఖలో జరిగిన ఐటీ కంపెనీల సీఇఓల సదస్సులో గూగుల్, విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా పలు ఐటీ కంపెనీలు హామీ ఇచ్చాయి. విశాఖను ఐటీ కేపిటల్ గా తీర్చిదిద్దడమే తన కల అని ప్రకటించిన బాబు… మధురవాడ ఐటీ సెజ్ ను హైటెక్ సిటీని చేస్తానన్నారు.

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఐటీ సెజ్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం నోవాటెల్‌లో ఐటీ కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి 400 ఐటీ కంపెనీలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా… విప్రో, టెక్‌ మహింద్రా, మాబ్‌ మి, సమీర్‌, టెస్పాల్వ్‌ సహా పలు ఐటీ కంపెనీలతో చంద్రబాబు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా గూగుల్‌ కంపెనీలతో ఏపీ సర్కార్‌ ఎంవోయూ కుదుర్చుకుంది. ఫైళ్లపై సంతకాలు చేసి ఇచ్చిపుచ్చుకున్నారు

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ ఏపి గా మార్చేందుకు గూగుల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల హర్షం ప్రకటించారు. విశాఖను ఐటీ కెపిటల్ గా తీర్చిదిద్దాలన్న తన కలను సాకారం చేసుకుంటానని చెప్పారు.
విశాఖ లో మానవ వనరులు, ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. హైటెక్ సీటీ తరహాలో మధురవాడ ఐటీ సెజ్ ను తీర్చిదిద్దుతానని సీఎం వెల్లడించారు. సిలికాన్ కారిడార్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానిది మేక్ ఇన్ ఇండియా స్లోగన్ అయితే… తనది మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదమని బాబు అన్నారు.

ఐటీ కంపెనీల సీఈఓలతో సమావేశం సందర్భంగా.. ఏపీ అభివృద్ధికి దోహదం చేసే ఐటీ పాలసీ, ఎల్ట్రానిక్స్ పాలసీ, ఇన్నోవేషన్ & స్టార్ట్ అప్ పాలసీలను చంద్రబాబు ప్రారంభించారు. ఇదిలావుండగా… ఏపీలో ఏడు వెల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఐటీ సిఈఓల భేటీలో విప్రో సంస్థ ప్రకటించింది. పలు ఐటీ కంపెనీలు కూడా ఈ తరహా ప్రతిపాదనలు చేశాయి. ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తామని టెక్ మహీంద్రా ప్రకటించగా… లాజిస్టిక్‌ ప్లానెట్‌ 1000 ఉద్యోగాలు. టెస్పాల్వ్‌ – 1,150 ఉద్యోగాలు, ట్రిగియో టెక్నాలజీ – 1,500 ఉద్యోగాలు ఇస్తామని తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని వివిధ కంపెనీల ఇఈఓలు హామీ ఇచ్చారు.