ఢిల్లీలో హాట్‌హాట్‌గా రాష్ట్ర రాజకీయాలు

Thursday, June 6th, 2013, 01:31:36 PM IST

ఢిల్లీలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి అధిష్టానం పెద్దలతో మంతనాలు జరిపి వస్తే, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఢిల్లీలోనే మకాం వేశారు. హస్తిన చేరిన డిప్యూటీ సీఎం రాజనర్సింహ వరుసగా అధిష్టానం పెద్దలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయిన రాజనర్సింహ.. ముఖ్యమంత్రి కిరణ్ వ్యవహార శైలి, డీఎల్ బర్తరఫ్ తదనంతర పరిణామాలపై వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు ఆజాద్ ను కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో మంతనాలు జరిపారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ
అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సమర్థత గల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని తెలిపారు.