దెబ్బ మీద దెబ్బ… ఏపీకి 24 వేల కోట్ల నష్టం

Wednesday, April 11th, 2018, 05:10:58 PM IST

ఇప్పటికే ప్రత్యేక హోదా వివాదంతో ఒకవైపు తలలు పట్టుకుంటే ఈ సారి ఏకంగా 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను యథాతథంగా కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రూ.24,340 కోట్లు నష్టపోనుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో గనక చూసుకున్నట్లయితే దేశంలో మరే రాష్ట్రమూ ఈ స్థాయిలో ఆర్థిక వనరులను కోల్పోయే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను మార్చాలని డిమాండు చేస్తూ మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర కూడా వచ్చారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటాకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ వాటా 4.308 శాతం నుంచి 3.692 శాతానికి తగ్గుదలకు సూచికగా ఉందని, దీనివల్ల తాము 0.616 శాతం వనరులను కోల్పోవాల్సి వస్తుందని మంత్రి యనమల ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నష్టం ఏటా సగటున రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. 1971-81 నుంచి 2001-11 మధ్యకాలంలో రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 20.53శాతం నుంచి 9.21శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. 2011 జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ప్రకటించిన విధి విధానాలన్నీ రద్దు చేసి, వాటి స్థానంలో రాష్ట్రాలతో మాట్లాడి కొత్త వాటిని రూపొందించే అధికారాన్ని పూర్తిగా ఆర్థిక సంఘానికే వదిలిపెట్టాలని డిమాండు చేశారు. తదుపరి ఆర్థిక మంత్రుల సదస్సును ఈ నెలాఖరులోగానీ, మే నెల మొదటివారంలోగానీ విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. దానిని కేవలం దక్షిణాది ఆర్థిక మంత్రులకే పరిమితం చేయకుండా 15వ ఆర్థిక సంఘం విధివిధానాలతో సమస్యలున్న అన్ని రాష్ట్రాలనూ ఆహ్వానించాలని నిర్ణయించారు. అందులో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు.