కొత్త కష్టం పెట్టావు బాబూ..

Friday, September 12th, 2014, 01:07:24 PM IST


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైఖరితో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ప్రభుత్వం-బ్యాంకులు-ఆర్‌బిఐ మధ్య కొనసాగుతున్న దోబూచులాట నేటికీ కొలిక్కి రాలేదు. వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు వీటిలో ఏ బ్యాంకు రైతుకు రుణం ఇవ్వడం లేదు. సాధారణంగా జూలై చివరి వరకు రైతులకు అవసరమైన రుణాలను ఇచ్చే బ్యాంకులు ఈ పర్యాయం రైతులకు రుణం ఇవ్వ కుండా మొహం చాటేస్తున్నాయి. దీంతో రైతన్న దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు.

తాము అధికారంలోకి రాగానే రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని సాధారణ ఎన్నికలకంటే ముందు టిడిపి హామీ ఇచ్చింది. తీరా టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడే రుణమాఫీ చేయలేమని చేతులెత్తేసింది. రైతులు తీసుకున్న రుణాల్లో లక్షా ఐభై వేల రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది జీఓకే పరిమితమయింది. అనేక షరతులతో రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పంట రుణాలు కాకుండా ఇతరత్రా వ్యవసాయ అవసరాలకు తీసుకున్న 50 వేల కోట్లను రైతులు చెల్లించాల్సి వస్తోంది. ఈ 50వేల కోట్లు మాఫీ కిందకు రావడం లేదు. షరతులు ఏవీ లేకుండా రుణమాఫీ జరిగిపోతుందని రైతులు భావించారు.. కానీ వడ్డీ తో సహా మొత్తం కట్టాల్సి వస్తుంది..

పంటల బీమా కూడా ఇప్పటి వరకు రైతులకు అందలేదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులకు పంటల బీమా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టివల్ల పంటలకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సదరు భీమా కంపెనీకి పంపిస్తే అన్ని కోణాల్లో పరిశీలన తర్వాత బీమాకు సంబంధించిన డబ్బును రైతులకు అందిస్తారు. ఈ కోణంలో ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు లేదని తెలుస్తోంది.

రుణాలు లేవు.. భీమా రాదు ..దీంతో ఏం చెయ్యాలో పాలుపోనీ స్థితిలో ఉన్నారు రైతులు. ఆర్‌బిఐ రుణమాఫీకి అంగీకరించిదంటూ ప్రభుత్వం పలుదఫాలుగా చేసిన ప్రకటనలన్నీ కట్టుకథలని తేలిపోయింది. రుణమాఫీని కేవలం కొన్ని ప్రాంతాలకే వర్తింపచేస్తామని ఆర్‌బిఐ ప్రకటించింది. అది కూడా ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ప్రస్తుతం బ్యాంకులకు రైతులుకు రుణాలు ఇస్తున్నా అసలు-వడ్డీ కలిపి రుణ బకాయిలను చెల్లించిన రైతులకే కొత్తగా రుణాలు ఇస్తున్నాయి. 2013-14 సంవత్సరంలో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించిన రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. 2014-15 సంవత్సరంలో ఖరీఫ్-రబీకి కలిపి పంట రుణాలుగా 56 వేల కోట్ల రూపాయల ఇవ్వాలని రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటి నిర్ణయించింది. ఏటా ఈ సమయానికి దాదాపు 30 వేల కోట్ల రూపాయలు రుణాలుగా విడుదలయ్యేవి. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ ఆరువేల కోట్ల రూపాయలు కూడా దాటలేదు.

గత ఏడాది పంట రుణాలు తీసుకున్న రైతులపై ఇప్పుడు వడ్డీ భారం అధికమైంది. 2013-14 సంవత్సర ఖరీఫ్‌లో పంట రుణాలు తీసుకున్న రైతులు 2014 జూన్ వరకు వాటిని తిరిగి చెల్లించి ఉంటే వడ్డీ మాఫీ లభించేది. అయితే ఇప్పుడు 13 శాతం వడ్డీతో అసలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లలో పండిన పంటలను విక్రయించిన రైతులు, వచ్చిన కాస్తో కూస్తో డబ్బును సొంత పనులకు వాడుకున్నారు. దీంతో అస్సలు, వడ్డీ కట్టి కొత్తగా రుణాలు తెచ్చుకోవాలని అనుకున్నా రైతుల వద్ద డబ్బులు లేవు. ఈ పరిస్థిత్తుల్లో వేసిన పంటను కాపాడుకోవాలంటే రైతులకు డబ్బులు అవసరం అవుతాయి. మరి ఇప్పటికైన్నా చంద్రబాబు తమ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టె దిశగా నిర్ణయాలు తీసుకుంటారని రైతులు ఎదురుచూస్తున్నారు