నిరుద్యోగ భృతిపై ఏపీ సర్కార్ తొలి అడుగు!

Thursday, May 31st, 2018, 11:27:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత ఎన్నికల మానిఫెస్టోలో నిరుద్యోగులకు భృతిని ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కాబినెట్ మంత్రులందరూ దీనికి ఆమోదం తెలిపారు. ఎంత మందికి ఈ భృతిని ఇవ్వాలని, ఏ ఏ విద్యార్హత వున్న వాళ్లకు ఇవ్వాలి, అలానే ఒక ఇంట్లో ఎంతమందికి ఇవ్వాలి, భృతి కొన్నాళ్లపాటు ఇచ్చాక వారి ఉపాధి చూపే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై ఒక అధ్యయనం చేపట్టారు. కాగా ప్రస్తుతం అది తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అమరావతిలో నేడు పలువురు మంత్రులతో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర ఏపీ ప్రజలకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై ఐటి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ఆయన అన్నారు. మేము ఇదివరకు మానిఫెస్టోలో చెప్పినట్లుగా నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి సిద్ధమని,

ఇప్పటికే పలు విధాలుగా నిరుద్యోగ భృతిపై చర్చించామని, కొన్ని ఇతర దేశాల్లో ఈ పధకం ఎలా అమలు అవుతుందో తెలుసుకుని ఇక్కడ కూడా దాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కాగా ఏపీలోని నిరుద్యోగ యువత, అనగా డిగ్రీ లేదా డిప్లొమా విద్యార్హత చేసి వున్న వారికి ఈ భృతి అందుతుందని అన్నారు. మొత్తంగా ఏపీలో పది లక్షలమందికి భృతిని అందచేయనున్నట్లు తెలిపారు. కాగా ప్రతి ఇంట్లోనూ ఇద్దరికీ మాత్రమే ఈ భృతిని అందచేస్తామని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులను తగ్గించి, దాదాపుగా ప్రతి ఇంట్లోనూ యువత ఎక్కడా కూడా ఖాళీగా ఉండకుండా, కొన్నాళ్లు భృతి పోందిన తర్వాత తమ అర్హతకు తగ్గ శిక్షణ అనంతరం మంచి ఉద్యోగం సంపాదించి తమ కుటుంబాలను ఆర్ధికంగా మెరుగుపర్చుకోవాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందించి, ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అయితే దీనిపై పూర్తి విధి విధానాలు, ఖచ్చితంగా ఎప్పటినుండి అమలు చేయనుననమ్ అనేవి అతిత్వరలో చెపుతామని ఆయా స్పష్టం చేశారు…..