లంచాల విషయంలో తెలంగాణ కంటే ఏపి ప్రజలే బెటర్ !

Saturday, October 13th, 2018, 12:01:58 AM IST

కొన్ని సంస్థలు ఏడాది కొకసారి అనేక సామాజిక అంశాలు, జాతీయ సమస్యలపై సర్వేలు నిర్వహిస్తుంటాయి. అలాంటి సంస్థల్లో నొయిడాకు చెందిన కమ్యూనిటీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ సంస్థ ఇండియా కరప్షన్ సర్వే 2018 నిర్వహించింది. దీని ద్వారా ఏయే రాష్ట్రాల్లో ప్రజలు పనులు చేయించుకోవడానికి ఎక్కువగా ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు లంచాలు ఇస్తున్నారనేది తేటతెల్లమైంది.

ఈ సర్వే ద్వారా గత ఏడాది కన్నా ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అవినీతి తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ తగ్గుదల కొద్దిగా మాత్రమే. ఈ సర్వేలో లంచాలిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ర్యాంకుల్లో కేసీఆర్ పాలనలోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 9వ స్థానంలో ఉండగా చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11వ స్థానంలో నిలిచారు. తెలంగాణలోని 43 % మంది ప్రజలు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇస్తుండగా, ఏపీలో 38 % మంది ప్రజలు లంచాలు సమర్పించుకుంటున్నారు.

ఈ మొత్తం ఎక్కువే అయినా గుడ్డి కంటేమెల్లే నయం అన్నట్టు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో లంచగొండితనం కొద్దిగా తక్కువగానే ఉంది. ఈ సర్వేలను చూసైనా ప్రభుత్వ ఉద్యోగుల్ని లంచాలు తీసుకోకుండా, ప్రజల్ని ఇవ్వకుండా కట్టడి చేసేలా రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే మంచిది. ఇకపోతే ఈ సర్వేలో ఎక్కువ లంచాలిస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, పంజాబ్ రెండవ స్థానంలో, తమిళనాడు మూడవ స్థానంలో ఉన్నాయి.