ఏపీకి హోదాతో పాటు కాపులకు కూడా అంతే ప్రాధాన్యత!

Monday, July 30th, 2018, 04:09:20 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు, రాజకీయ నాయకుల మాటలు వేడిని పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, అలానే విభజన హామీలు బీజేపీ విషయమై మాట తప్పిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన వైసిపి, జనసేన, కాంగ్రెస్ లు మాత్రం చంద్రబాబు నాలుగేళ్ళ పాటు కాలయాపన చేసి కేంద్రం పై సరిగా పోరాడకుండా ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమన్ చాందీ ఏపీలో విస్తృత పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన నేడు గన్నవరం విమానాశ్రయంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై టీడీపీ, బీజేపీ లు పూర్తిగా మాట తప్పాయని,

ఇటీవల జాతీయ కాంగ్రెస్ నాయకుల అధ్యక్షతన జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో తమ జాతీయనేతలు సోనియా మరియు రాహుల్ లు తీర్మానించినట్లు రాబోయే ఎన్నికల్లో తాము కేంద్రం లో అధికారం చేపడితే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని, అంతే కాదు ఈ ఎన్నికల్లో తాము ఏపీలో కీలక పాత్ర పోషించి తీరుతామని ఆయన అన్నారు. అలానే ఏపీలో ఎంతో ముఖ్యమైన కాపు రిజర్వేషన్ల అంశంపై కూడా బాబు కుట్ర పన్ని దానిని అమలు చేయలేకపోయారని, మొన్న వైసిపి అధినేత జగన్ కూడా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయలేము, కానీ వారికీ సముచిత ప్రాధాన్యం ఇచ్చి, వారికి విస్తృత స్థాయిలో నిధులు కల్పిస్తామని అనడం వింతగా ఉందన్నారు. అయితే తమ పార్టీ మొదటి నుండి కూడా కాపులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికీ కూడా వారు మా వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేసారు. తాము కనుక అధికారం చేపడితే హోదాకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, కాపుల రిజర్వేషన్లకు అంతే ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments