సరైన లీడరే లేడు.. మళ్ళీ గట్టి పోటీ ఇస్తారట !

Tuesday, September 18th, 2018, 09:23:57 AM IST

రాబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన మహాకూటమిల నడుమ త్రిముఖ పోరు నడవనున్న నేపథ్యంలో బీజేపీ తాము కూడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తామని లేని డాబులు పలుకుతోంది. కేంద్రంలో అధికారం బీజేపీదే అయినప్పటికీ రాష్ట్రంలో పార్టీని నడపగల సరైన లీడర్ లేడు. ఆ మాటకొస్తే అసలు పార్టీ మనుగడే అంతంతమాత్రమని చెప్పొచ్చు.

గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలతో దోస్తీ పెట్టుకుని గుంపులో గోవింద అన్నట్టు కేవలం నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఎవరి తోడూ లేకుండా ఒంటరి పోరుకు దిగుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్ర రాజకీయాలు తనవి కావన్నట్టు నడుచుకునే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మినహాయిస్తే అసలు పార్టీలో రాష్ట్ర స్థాయిలో జనాకర్షణ కలిగిన నాయకుడు ఒక్కడంటే ఒక్కరు కూడ లేరు. దానికి తోడు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే నిందను నెత్తిన వేసుకుని ప్రజల్లో అప్రదిష్టను మూటగట్టుకున్న కమల దళం సవాళ్ళను విసరడం చూస్తుంటే ఏడవలేక నవ్వుతున్నట్టే ఉంది.

ఈ వాస్తవాలన్నీ వారికి తెలియని కావు. కానీ స్వతంత్ర్యంగా పలాయనం చిత్తగిస్తే పరువుపోతుందని ఈ మాటల రాజకీయాలు చేస్తున్నారు రాష్ట్ర నాయకులు. ఇక పార్టీని కాపాడటానికి అధ్యక్షుడు అమిత్ షా దిగినా ద్వయంగా ప్రధాని మోడీ వచ్చి సభలు పెట్టినా ప్రయోజనం మాత్రం శూన్యమే.