అందమైన రాజధాని కోసం..

Saturday, September 27th, 2014, 12:46:06 AM IST

ap-capital
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తొలి అడుగు పడింది. దేశంలోనే అందమైన రాజధాని నిర్మిస్తామంటూ ఆ రాష్ట్ర మంత్రుల కమిటీ వెల్లడించింది. కొత్త రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కొత్త రాజధానిని సరికొత్త హంగులతో రూపొందించడాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన ఆ రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఉగాదిలోగా రాజధాని మొదటి ఫేజ్ పూర్తి చేసే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. ఇందుకోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి సచివాలయంలో సమావేశమైంది. రాజధాని నిర్మాణంతో పాటు మౌలిక వసతులు, విద్య వైద్య రంగాలను అభివృద్ధి చేయడంపై చర్చించింది. రైతుల నుంచి భూసేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టిన కమిటీ, ల్యాండ్ పూలింగ్ విధానంతో వారికి లాభం చేకూరుస్తూనే భూసేకరణ జరపాలని నిర్ణయించింది. సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు పాల్గొని చర్చించారు. యనమల చాంబర్ వేదికగా మంత్రులు భేటీ అయిన మంత్రులు దశలవారీగా రాజధాని నిర్మిస్తామని వెల్లడించారు.

రాజధాని నిర్మాణానికి అవసరమైన మొత్తం భూమిని ఆరు నెలల్లో సేకరించి, వర్గీకరించాక, మరో ఆరునెలల్లో నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఎంత షేర్ ఇస్తారని అడిగినప్పుడు మాత్రం.. నేరుగా చెప్పకుండా ఇతర వివరాలు అన్నీ ఏకరువు పెట్టారు. చండీగఢ్ లో ఎకరాకు 1100 చదరపు గజాలు ఇచ్చారని, అందులో వెయ్యి గజాలు రెసిడెన్షియల్, 100 గజాలు కమర్షియల్ ఇచ్చారని తెలిపారు. ఇది 22-23 శాతం అవుతుందన్నారు. గాంధీనగర్ లో అభివృద్ధి చేసినదాంట్లో 25 శాతం, నయా రాయ్ పూర్ లో అభివృద్ధి చేసినదాంట్లో 35 శాతం ఇచ్చామన్నా, వాస్తవానికి వారికి వెళ్లింది 29 శాతమేనన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాంతాన్ని బట్టి, అక్కడ అభివృద్ధి చేయడానికి అయిన వ్యయాన్ని బట్టి ఎంత వాటా ఇవ్వాలన్నది నిర్ణయిస్తామన్నారు.

మొత్తం లక్ష ఎకరాల వరకు భూమిని సేకరించాలని నిర్ణయించారు. తొలిదశలో 25 వేల ఎకరాలు, రెండో దశలో మరో 25 వేల ఎకరాలు సేకరించనున్నారు.