తెలంగాణలో అపాచీ ఘన ప్రారంభం..

Friday, March 2nd, 2018, 08:52:57 AM IST

తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఘన ప్రారంభానికి నోచుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల సెజ్‌లో అపాచీ సైనిక హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి సిద్దం అయింది. ఎన్నో దిగ్గజ కంపనీలతో కొలువుదీరిన టాటా గ్రూపు ఈసారి బోయింగ్‌ కంపెనీతో కలిసి స్థాపించిన టాటా బోయింగ్‌ ఏరో స్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, మంత్రి కేటీఆర్‌, టాటా గ్రూపు గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా, అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ తదితరులు గౌరవ లాంఛనంగా ఘనంగా ప్రారంభించారు. మంత్రి నిర్మలా సీతారామన్‌ కొంతసేపటి వరకు అచ్చ తెలుగులో మాట్లాడి తెలంగాణ యువతీ, యువకులకు, టాటా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం ఆమె మాట్లాడుతూ, దేశ రక్షణ ఆయుధాల ఉత్పత్తికి తోడ్పాటు చేసే రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని అన్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న మన భారతావని ఇక ఆయుధాల ఎగుమతుల్లోనూ మన సత్తా చాటాల్సిన సమయం వచ్చేసిందన్నారు. ఆయుధ ఎగుమతుల్లోనూ మన దేశం ముందుండాలనే ప్రధాని మోదీ లక్ష్యం అని ఈ విధానాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికాభివృద్ధితోపాటు టాటా గ్రూపు కుడా అంచెలంచెలుగా ఎదుగుతూవస్తుందన్నారు. టాటా, బోయింగ్‌ కంపెనీలను ఆమె అభినందించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ రంగానికి మంచి ప్రోత్సాహం లభించిందన్నారు.

రక్షణ పరిశ్రమలకు ప్రత్యేక కారిడార్‌ ఇవ్వాలి: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో రక్షణ పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ సభా పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఇప్పటికే బోయింగ్‌, లాక్‌హీడ్‌, ఎయిర్‌ బస్‌, సిరోస్కి వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజ వైమానిక కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి సంబందించిన పది ఆర్‌ అండ్‌ డీ సంస్థలు కుడా ఇక్కడే ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన విడి భాగాలను స్థానికంగా 1,000 ఎంఎస్ఎంఈలు సరఫరా చేస్తున్నాయి. ఈ విషయాన్ని తమ దృష్టిలో ఉంచుకుని,హైదరాబాద్‌లో రక్షణ పరిశ్రమల కారిడార్‌ ఏర్పాటు చేసే విషయం కాస్త క్షుణ్ణంగా పరిశీలించాలని రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని చెప్పారు. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో విమానాలు తయారయ్యే రోజు కూడా త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. టాటా గ్రూపు గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా, భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ ఈ సభలో పాల్గొన్నారు.

తెలంగాణ యువకులకు హృదయపూర్వక అభినందనలు

ఆదిభట్ల సెజ్‌లో బోయింగ్‌-టాటా ఏరోస్పేస్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేసి ఇప్పటికి సంవత్సరంనర గడిచింది. ఇంత తక్కువ సమయంలోనే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన అపాచీ హెలికాప్టర్ల విడి భాగాలను ఏమాత్రం లోపాలు లేకుండా (జీరో డిఫెక్ట్స్‌) తయారు చేశారు దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. తయారు చేసిన వాటిని అమెరికాకు పంపించగా అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడం నిజంగా ఒక గొప్ప విషయం అన్నారు. విడి భాగాలను అతి తక్కువ కాలంలో ఎలాంటి లోపాల్లేకుండా తయారు చేయడాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు. కొద్దిపాటి శిక్షణతో ఇంత త్వరగా నైపుణ్యాలను వంట పట్టించుకున్నందుకు తెలంగాణ యువకుల్ని ఆమె తెలుగులో మాట్లాడి మరీ అభినందించారు. ‘‘ఇక్కడ ఎలాంటి ఆటోమేషన్‌ లేదు. ఉత్పత్తికి రోబోలనూ ఉపయోగించడం లేదు. అయినప్పటికీ కొద్దిపాటి శిక్షణతోనే తెలంగాణ యువకులు ఇంత ఘన స్థాయికి చేరడం అంటే మామూలు విషయం కాదని, అందుకు వారిని అభినందిస్తున్నా’’ అని అన్నారు. దాంతో, సభా స్థలి చప్పట్లతో ఆనంద జ్వాలలతో ధ్వనులతో ప్రతిధ్వనించింది.

భారత్‌లో ఉత్పత్తి రంగం ఇంత తొందరగా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోందని బోయింగ్‌ కంపెనీ డిఫెన్స్‌, స్పేస్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రెసిడెంట్‌, సీఈవో లీనె కారెట్‌ మాట్లాడారు. ‘‘గత రెండేళ్లలో భారత్‌ నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకోవడం ఒకటికి నాలుగింతలు పెరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఏటా 100 కోట్ల డాలర్లకుపైగా విలువ చేసే విడి భాగాలు దిగుమతి మేము చేసుకుంటున్నాం. ప్రపంచ అవసరాలకు తగ్గట్టు భారత్‌లోనే అత్యాధునిక పరికరాల తయారీకి శంఖు స్థాపన చేసాం. ఇందుకు స్థానికంగా ప్రతిభ, శిక్షణ, నైపుణ్యాల పెంపుపై దృష్టి ద్రుష్టి సారించాం. టీబీఏఎల్‌ ఏర్పాటు విధానాలతో మా అంతర్జాతీయ కస్టమర్లకు అపాచీ హెలికాప్టర్లను మరింత వేగంగా సరఫరా చేసేందుకు సులభమవుతుంది’’ అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం పదేళ్ల క్రితమే రతన్‌ టాటా తమను సంప్రదించారని, ఆ కల నేటికి నెరవేరిందని అయినప్పటికీ ఇంత ఘన విజయం సాధించడం నిజంగా గొప్ప విషయం అని తెలిపారు. ఈ యూనిట్‌లో సైనిక అవసరాలకు ఉపయోగించే ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్టర్ల అన్ని విడి భాగాలు ఎలాంటి లోటు పాట్లు లేకుండా తయారు చేస్తారని తెలిపారు.