కేసిఆర్ ఆత్మ తన పని తాను చేసుకుపోతోంది !

Thursday, September 27th, 2018, 12:01:07 AM IST

కొడుకు ఎదుగుదల కోసం కేసిఆర్ హరీష్ రావును తోక్కేస్తున్నారు, పార్టీలో సరైన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, ఇక హరీష్ రావు రాజకీయ భవిష్యత్తు పాతాళానికే అంటూ ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా ఆరంభం నుండి కేసిఆర్ కు ఆత్మలా వ్యవహరించి, ఎన్నో వ్యవహారాలను చక్కబెట్టిన హరీష్ రావు మాత్రం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తాను స్వామి భక్తుడినే అంటూ తన పని తాను చేసుకుపోతున్నారు.

నియోజకవర్గ అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇతర పార్టీల చోటా మోటా నాయకుల్ని, భారీగా కార్యకర్తలని పార్టీలోకి లాగేస్తున్నారు. తాజాగా తన ఇంట్లోనే ఈ చేరికల పర్వాన్ని చేపట్టారాయన. మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి. గుండప్పను పార్టీలో చేర్చుకున్నారు హరీష్.

అలాగే తెలంగాణ రాష్ట్ర పీఆర్టీయూ మాజీ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎం. సుభాష్ రెడ్డి, కోహిర్ మాజీ జెడ్పీటీసీ శాంతమ్మ, జహీరాబాద్ బ్రాహ్మణుల సంఘం అధ్యకదులు, మాజీ బీజేపీ ఇన్ చార్జ్ రామ్ కుమార్ దేశ్ పాండే, మాజీ సర్పంచ్ మైతారి నర్సయ్య, టీడీపీ మాజీ కౌన్సిలర్ కంటెప్ప, ఇంకొండతమంది జహీరాబాద్ టీడీపీ నేతలు హరీష్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఎంతమంది ఎన్ని మాట్లాడినా పక్కనబెట్టేసి హరీష్ ఇలానే తన కర్తవ్యాలను తాను నిర్వర్తిస్తూ పోతే పార్టీలో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.