అమ్మ చికిత్సని సీక్రెట్ గా ఉంచింది అందుకే..!

Thursday, February 23rd, 2017, 06:17:37 PM IST


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలో ఉన్న అనుమానాలపై మద్రాసు హై కోర్ట్ నేడు విచారణ చేపట్టింది.జయకు చికిత్స చేపట్టిన అపోలో ఆసుపత్రి వర్గాలు జస్టిస్ రమేష్, జస్టిస్ మహదేవన్ లతో కూడిన న్యాయమూర్తుల బెంచ్ ముందు వివరణ ఇచ్చాయి. జయ చికిత్స సమయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలకు లోబడే కొన్ని విషయాలు ప్రజలకు వెల్లడించలేదని వారు న్యాయమూర్తుల బెంచ్ ముందు వివరించారు.

అంతే కాక చికిత్స సమయంలో తన ఫోటోలను బయటకు విడుదల చేయవద్దని స్వయంగా జయలలిత కోరారని అపోలో వర్గాలు తెలిపాయి.కొన్ని పత్రిక ప్రకటనలు కూడా ఆమె అనుమతితోనే విడుదల చేసినట్లు కోర్టుకు అపోలో తెలిపింది.కాగా జయలలిత 75 రోజులపాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5 న మరణించిన విషయం తెలిసిందే. ఆమె చికిత్స సమయంలో స్పష్టమైన సమాచారం తెలపకుండా ప్రభుత్వం, అపోలో ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేసారు. జయ మరణం పై అనుమానాలు ఉన్నాయంటూ జోసెఫ్ అనే వ్యక్తి హై కోర్ట్ లో ఫిటిషన్ దాఖలు చేశారు.