ఏపీకి ప్రత్యేక హోదా మా వల్లే సాధ్యం అంటున్న నేత!

Tuesday, July 10th, 2018, 09:25:58 PM IST


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, రానున్న రోజుల్లో యుపిఎ ప్రభుత్వాన్ని తప్పక అధికారం లోకి తీసుకురాగలరని, అంతేకాదు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆయన ప్రధాని కాగానే ఆయన చేయబోయే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైనే ఉంటుందని, ఏపీ పిసిసి చీఫ్ రఘువీరా అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ ప్రస్తుతం ఏపీ మొత్తం సుడిగాలి పర్యటనలు చేపట్టిన సందర్భంగా రఘువీరా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం, ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ తో పొత్తు పెట్టుకుని ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చాందీ అన్నారు. దేశాన్ని ప్రగతిపథాన తీసుకెళ్లాలని, ప్రజా సంక్షేమం తమ పార్టీ ముఖ్య ఉద్దేశం అని చెపుతున్న మోడీ, ఏపీకి తీరని అన్యాయం చేసారని విమర్శించారు.

ఇప్పటికే మోడీ చేస్తున్న అసమర్ధ పాలన వల్ల యావత్ భారత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, ఆ పార్టీ నేతలు కూడా ఆయనని వెనకేసుకొస్తూ, గత మేనిఫెస్టోలోని అంశాలు అమలుచేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజల పరిస్థితులపై పూర్తిగా అవగాహనా చేపట్టిందని, దాదాపుగా ప్రతివారిలోనూ టీడీపీ మమ్మల్ని మోసం చేసిందనే వాదన అందరిలోనూ ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు కేవలం ఇక్కడి ప్రజల ఓట్ల కోసం మాత్రమే వెంపర్లాడతారని, ఎప్పుడయితే అయన గత ఎన్నికల్లో సీఎం పదవి చేపట్టారో అప్పటినుండి తమ పార్టీ నేతలకు, కుమారుడికి, కార్యకర్తలకు మాత్రమే తగిన రీతిన న్యాయం చేసుకుంటున్నారని అన్నారు. బాబు వస్తే అన్ని సమస్యలు తీరుతాయి అనుకున్న ప్రజలను బాబు నిలువునా ముంచారని మండిపడ్డారు. కావున ఏపీ ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కడితే వారి సమస్యలు తీరడమే కాక, ఇక్కడ అభివృద్ధి కూడా పూర్తిగా జరుగుతుందని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments