ట్రెండింగ్ : ఫేక్ న్యూస్ రాస్తే…. ఇక అంతే సంగతులు!

Tuesday, April 3rd, 2018, 04:00:58 PM IST

ప్రస్తుత మీడియా ప్రపంచంలో నకిలీ వార్తలు కొన్ని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాయి అని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఫేక్ న్యూస్ కు అడ్డుకట్ట వేసేందుకు ఒక తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై నకిలీ వార్తలను పత్రికల్లో ప్రచురించడం, టీవీల్లో ప్రసారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే అందుకు బాధ్యులైన‌ జర్నలిస్ట్‌లకు ఇచ్చే అక్రెడిటేషన్ ర‌ద్దు చేయాల‌ని కేంద్ర సమాచార శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఫేక్ న్యూస్ పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుద‌ల చేసింది. త‌మ‌కు ఏదైనా ఒక వార్త నకిలీది అని ఫిర్యాదు వస్తే వాటిని ప్రింట్ మీడియా అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ఎలక్ట్రానిక్ మీడియా అయితే న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌కు రిఫర్ చేస్తామని పేర్కొంది.

ఆయా సంస్థ‌లు 15 రోజుల్లో ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తి చేస్తాయ‌ని, ఆ స‌మ‌యంలో జర్నలిస్ట్ అక్రెడిటేషన్ సస్పెన్షన్‌లో ఉంటుందని, ఆ వార్త త‌ప్పని తేలితే చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెప్పింది. తొలిసారి ఉల్లంఘనకు పాల్ప‌డితే ఆరు నెలలు, రెండోసారి మ‌ళ్లీ ఫేక్ న్యూస్ రాస్తే ఏడాది పాటు, మూడవ‌సారి ఉల్లంఘ‌న‌ అయితే శాశ్వతంగా అక్రెడిటేషన్ రద్దు చేస్తామని తేల్చి చెప్పింది.అయితే కేంద్రం చేసిన ప్రకటనలోనే డొల్లతనం ఉందని పలువురు జర్నలిస్టులు మండిపడుతున్నారు. అసలు నకిలీ వార్తకు నిర్వచనం ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! ఒక వేళ ఫలానా వార్త నకిలీదని నిర్వచించి, గుర్తించే వ్యక్తి ఎవరు, వంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం తప్పక సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

ఒక వేళ తాజా మార్గదర్శకాలను జర్నలిస్టులు తూచా, తప్పకుండా పాటిస్తే కాస్తో కూస్తో బ్రతికున్న పత్రికా స్వేచ్ఛ పూర్తిగా సమాధి అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజా నిర్ణయం పత్రికా స్వేచ్ఛను మరింత హరించేదిగా ఉంది. ప్రభుత్వానికి నచ్చని వార్తలన్నీ నకిలీ వార్తలే, అంతేకాకుండా సర్కార్ కు వ్యతిరేకంగా ఉండే నిప్పులాంటి నిజాలన్నీ తప్పుడు వార్తలే అని పలువురు అంటున్నారు. అటువంటిది తాజా నిబంధనలు పాటిస్తే, ప్రభుత్వం రాయమన్నదే అసలు సిసలు వార్త అవుతుంది, అటువంటపుడు పత్రికలు, టీవీ చానెళ్లు, జర్నలిస్టుల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇటువంటి స్వయంకృతాపరాధాలతో కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు….