క్రీడా ఆణిముత్యాలకు అర్జున అవార్డులు

Tuesday, August 13th, 2013, 10:00:10 PM IST

Virat-and-Sindhu
టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. భారత జట్టులో కీలక స్థాయికి ఎదిగిన కోహ్లీ, ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. తాజాగా, ధోనీ గైర్హాజరీలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి జింబాబ్వే టూర్లో జట్టును విజయపథంలో నడిపించాడు.

ఇక ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై విశేషంగా రాణిస్తున్న సింధు, తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ వరల్డ్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా సింధు రికార్డు పుటల్లోకెక్కింది.

ట్రాప్ షూటర్ రంజన్ సోధీకి ‘రాజీవ్ ఖేల్ రత్న’
డబుల్ ట్రాప్ షూటర్ రంజన్ సోధీ (35) ప్రతిష్ఠాత్మక ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు ఎంపికయ్యాడు. ‘ఖేల్ రత్న’ దేశంలోని క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం. కాగా, ఈ అవార్డు అందుకుంటున్న ఏడో షూటర్ సోధీ. సోధీ 2011లో ప్రపంచ టైటిల్ ను నిలుపుకున్నాడు. అంతకుముందు 2010లో ఆసియా గేమ్స్ లో స్వర్ణం, అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రెండు రజతాలు చేజిక్కించుకున్నాడు. కాగా, హైదారబాదీ షూటర్ గగన్ నారంగ్ కు ఈ పురస్కారం 2010-11లో లభించింది.