కేసీఆర్‌ని తిడుతూనే కారుతో క‌లిసి!!

Friday, December 7th, 2018, 03:00:07 PM IST

తెలంగాణ ముంద‌స్తు స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో తెరాస‌ను మ‌ట్టిక‌రిపించ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌హాకూట‌మి పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌, తెజ‌స‌, సీపీఐ, తెలంగాణ పార్టీలన్నీ ఏకమై బ‌రిలోకి దిగాయి. తెరాస‌కు ధీటుగా మ‌హాకూట‌మి, బీజేపీ త‌న మేనిఫెస్టోని ప్ర‌క‌టించి ఓట‌ర్ల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేసాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి మేనిఫెస్టోని ప్ర‌క‌టించ‌కుండా, అస‌లు మేనిఫెస్టో అన్న‌దే లేకుండా పోటీకి దిగిన ఏకైక పార్టీ ఎంఐఎం. ఎనిమిది నియోజ‌క వ‌ర్గాల్లో పోటీప‌డుతున్న ఈ పార్టీకి తెరాస మ‌ద్ద‌తు తెలుపుతోంది. ఎంఐఎం కూడా తెరాస‌కు ఓటేయండ‌ని బాహాటంగానే ప్ర‌చారం చేసింది కూడా.

తెలంగాణ‌లో పోటీకి దిగిన 16 పార్టీలు త‌మ‌త‌మ మేనిఫెస్టోని ఛీఫ్ ఎల‌క్ష‌న్‌ అధికారికి స‌మ‌ర్పించాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 116 పేజీలతో, తెలుగు దేశం 34 పేజీల మేనిఫెస్టోని అంద‌జేశాయి. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ 44 పేజీల మేనిఫెస్టోని పొందుప‌ర‌చ‌గా తెలంగాణ రాష్ట్ర స‌మితి కేవ‌లం 19 పేజీల మేనిఫెస్టోని పొందుప‌ర‌చ‌డం విశేషం. ఇక ఎంఐఎం మేనిఫెస్టోని ప్ర‌క‌టించ‌కుండా ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్న‌క‌ల్లో సింగ‌ల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచామ‌ని, మా రోడ్ ప్లానే మేనిఫెస్టో అని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఆస‌క్తిక‌రంగా గులాబీ పార్టీని తీవ్రంగా హెచ్చ‌రిస్తూ, తిడుతూ ఉండే ఎంఐఎం ఎన్నిక‌ల వ‌ర‌కూ పొత్తుక‌ట్ట‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక గులాబీ పార్టీతో పూర్తిగా క‌లిసేది లేదంటూనే కేవలం మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారంతే.