యాషెస్ సిరీస్ లో ‘సిలికాన్’ దుమారం

Thursday, August 8th, 2013, 03:04:53 PM IST

kevin-pietersen

యాషెస్ సిరీస్ లో ఒకటి పోతే మరొకటి అన్నట్టుగా.. వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గతంలో డీఆర్ ఎస్ విషయంలో చెలరేగిన దుమారం.. తాజాగా సిలికాన్ వివాదం.. ఇలా ఇంగ్లీష్ క్రికెట్ ను అప్రతిష్టపాలు చేస్తున్నాయి. చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లే ముందుండేవారు. ఐతే ఈసారి మాత్రం ఇంగ్లండ్ క్రికెటర్ల వంతయింది.

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ సిలికాన్ టేప్ ను బ్యాట్ కు అంటించుకున్నాడని.. దీని వల్ల బంతి బ్యాట్ కు తగిలినా హాట్ స్పాట్ గుర్తించలేదని.. ఆస్ట్రేలియాకు చెందిన నైన్ టెలివిజన్ లో కథనాలు ప్రసారమయ్యాయి. ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కెవిన్ పీటర్సన్ అవుటైనా వెళ్లిపోలేదని.. బంతి అతడి బ్యాట్ ను తాకిన శబ్ధం స్పష్టంగా వినిపించినప్పటికీ హాట్ స్పాట్ లో తేలలేదని కథనంలో చెప్పింది.. పీటర్సన్ సిలికాన్ టేప్ వాడి రివ్యూ సిస్టమ్ ను చీట్ చేశాడని తెలిపింది. అయితే ఈ విషయాలను పీటర్సన్ కొట్టిపారేశాడు. తాను ఔటవుతానని ఎప్పుడూ భయపడలేదని.. బ్యాట్ కు బంతి తగిలివుంటే తానే పెవిలియన్ కు వెళ్లేవాడినని ట్వీట్ చేశాడు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని…అవన్నీ అబద్ధాలని చెప్పాడు. ఒకవేళ తాను సిలికాన్ టేప్ వాడినట్టయితే తొలి ఇన్నింగ్స్ లో ఎల్బీడబ్ల్యూగా అవుటవాల్సి వచ్చేదే కాదని ట్విట్టర్ లో తెలిపాడు.

ఇక సిలికాన్ టేపు వివాదం ఆస్ట్రేలియా క్రికెటర్లకు తాకకముందే వాళ్లూ స్పందించారు.. దీనికి సంబంధించిన పరిజ్ఞానం తనకు లేదని ఆసీస్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తెలిపాడు….తమ ఆటగాళ్లు కూడా డ్రెస్సింగ్ రూమ్ లో ఇటువంటి విషయంపై ఎప్పుడూ చర్చించుకోవడం తాను వినలేదని చెప్పాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బర్డ్ , ఆల్ రౌండర్ స్టీవెన్ స్మిత్ లు కూడా ఈ విషయంపై స్పందించారు. తాము ఇలాంటి విషయాలను ఎప్పుడూ వినలేదని…సిలికాన్ టేపులు వాడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.. ఇవేవీ తమ ఆటపై ప్రభావం చూపబోవని.. రానున్న రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణిస్తామని చెప్పారు. ఈ విషయంపై ఐసీసీ విచారణ కూడా చేపట్టిందంటూ ఆస్ట్రేలియాకు చెందిన టీవీ చానల్ వార్తలను ప్రసారం చేసింది..ఐతే ఇదంతా అబద్ధమని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ అంటున్నాడు.. ఇక ఇదే విషయాన్ని ఐసీసీ కూడా ఖండించింది.. రివ్యూ సిస్టమ్, హాట్ స్టాట్ గురించి ఇరుజట్లు, అంపైర్లతో సమావేశమై చర్చిస్తామని ఐసీసీ జనరల్ మేనేజర్ అలార్డిస్ తెలిపాడు.

మొత్తానికి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టుకు ముందే ఇరుజట్లనూ సిలికాన్ వివాదం రెచ్చగొట్టింది. దీంతో ఈ టెస్టు అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగించింది.