జగన్ పై దాడి చేసింది టీడీపీ వ్య‌క్తే.. నా ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయి.. మాజీ ఎంపీ సంచ‌ల‌నం..!

Monday, November 12th, 2018, 09:25:33 AM IST

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై అక్టోబ‌ర్ చివ‌రి వారంలో విశాక‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా క‌త్తితో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ వైసీపీ అభిమాని అని డీజీపీతో స‌హా టీడీపీ నేత‌లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా జ‌గ‌న్‌తో నిందితుడు శ్రీనివాస్ ఉన్న ఫ్లెక్సీల‌ను కూడా టీడీపీ నేత‌లు త‌మ‌ ఆరోప‌ణ‌ల్లో భాగంగా వాడుకున్నారు. అయితే శ్రీనివాస్ ప‌క్కా టీడీపీ కార్య‌క‌ర్తే అని బ‌ల్ల గుద్ది మరీ చెబుతున్నారు మాజీ ఎంపీ.

అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే మాజీ ఎంపీ జీవీ హ‌ర్ష‌కుమార్ మాట్లాడుతూ జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం చేసిన జ‌నుప‌ల్లి శ్రీనివాస‌రావు అత‌ని కుటుంబ‌స‌భ్యులు టీడీపీ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లే అని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పారు. జ‌గ‌న్ పై దాడి పెద్ద కుట్ర అని..పోలీసులు ఇన్వెస్టిగేష‌న్‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని.. హ‌ర్ష‌కుమార్ అన్నారు. విశాక‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో ఉద్యోగం సంపాదించాలంటే ఎన్ఓసీ కావాల‌ని.. అది పొందాలంటే చాలా క‌ష్ట‌మ‌ని.. దీంతో శ్రీనివాస్‌కు తేలిగ్గా ఎన్ఓసీ రావ‌డం వెనుక టీడీపీ నేత‌ల హ‌స్తం ఉంద‌ని హ‌ర్ష‌కుమార్ ఆనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో ఈ మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. మ‌రి ఈయ‌న వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.