కేసీఆర్ రైతుల పాలిట దేవుడు : బాబా రాందేవ్

Wednesday, April 11th, 2018, 11:00:29 AM IST

రైతులకోసం పాటుపడే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లాంటి సీఎం దేశంలోనే ఎవ్వరూ లేరని యోగా గురువు రాందేవ్‌బాబా అన్నారు. దేశంలో ఎంతోమంది సీఎంలను చూశానని, కేసీఆర్‌లాంటి సీఎం ఎక్కడా లేరని చెప్పారు. ఆయన రైతు బాంధవుడని అభివర్ణించారు. రైతుల గురించి సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్తూ, అందులో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. తమకు కూడా రాయితీలు ఇస్తే ఇందూరులో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పుతామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి 40 శాతానికి మించి కేటాయింపులు చేసిన తొలి సీఎంగా కేసీఆర్ దేశంలోనే గుర్తింపు పొందారని ప్రశంసించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో కూడా రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా నిలువాలని ఆకాంక్షించారు. రైతులకోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నట్లు దేశంలో ఎవరూ చేయటంలేదు. ఎవరైనా మంచి పనిచేస్తే దాన్ని మెచ్చుకోవడంలో తప్పేముంది? కొంతమంది నాయకులు రైతుల గురించి ఎంతో చెప్తారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. రైతులను అన్నదాతలతో పోలుస్తారు. కానీ రైతుల బాధలు వారికి స్వయంగా తెలియవు. రైతుల బాధలు, ఆవేదన కేసీఆర్ అనుభవించారు. ఆయనకు ఆ బాధలు తెలుసు. వో ఖేత్‌మే.. గావ్ మే కిసాన్‌కే సాథ్ ఫొటో సెషన్ కేలియే నహీ జాతా హై.. ఉస్కీ తస్వీర్ ఔర్ తక్దీర్ బదల్నేకో జాతే హై (సీఎం కేసీఆర్ పొలాల్లో, గ్రామాల్లో రైతుల దగ్గరకు ఫొటోలు దిగటానికి వెళ్లరు.. రైతు జీవనచిత్రాన్ని, తలరాతను మార్చేందుకు వెళ్తారు) అనిచెప్పారు. అందుకే ఈ సీఎం అంటే తనకెంతో ప్రేమని అన్నారు. దేశానికి రైతులు ఆత్మలాంటి వారని, వారు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని రాందేవ్‌బాబా చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై ఆయన స్పందిస్తూ.. నాకు రాజకీయంగా సంబంధాలు తక్కువ. ఇపుడు నేనేమీ చెప్పను. జో అచ్ఛా కరేగా.. వో ఆగే బడేగా (ఎవరైతే మంచి చేస్తారో వారు ముందుకుపోతారు). మేం ప్రతి మంచిపనికీ తోడుంటాం. రైతుకు మద్దతుగా నిలిచేవారి వెంట ఉంటాం. రైతుల కోసం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం దేశంలో మరెవ్వరూ లేరు అని ఆయన అన్నారు. అధికారాన్ని వికేంద్రీకరించి, రాష్ర్టాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలని చెప్పారు.