చూసి రమ్మంటే కాల్చి వచ్చిన బాలయ్య!

Tuesday, October 2nd, 2018, 09:43:18 AM IST

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మహాకూటమిలో కలిసిన తమ పార్టీని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలా అని సతమతమైన చంద్రబాబు తనకి బదులు వియ్యంకుడు బాలక్రిష్ణను ప్రచారానికి పురమాయించి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారు. బాబు మాట మేరకు నిన్న ఉమ్మడి అనంతపురం, ఖమ్మం జిల్లాలో పర్యటించారు బాలయ్య.

ఉదయాన్నే మొదలైన బాలయ్య ప్రచారం రాడ్ షోలు, బైక్ ర్యాలీలు, విగ్రహావిష్కరణలు అంటూ సాయంత్రం వరకు బాగానే సాగింది. అప్పటి వరకు చాలా ఓపిగ్గా ఉన్న బాలకృష్ణ ఖమ్మం జిల్లా తల్లాడ నుండి మిట్టపల్లికి వెళ్ళగానే కంట్రోల్ తప్పారు. తల్లాడ వద్ద బాలయ్యను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఒకానొక దశలో కాన్వాయ్ కి అడ్డంపడ్డారు.

దీంతో ఆగ్రహించిన బాలక్రిష్ణ కారు దిగి మరీ కొందర్ని కాలితో తన్ని, మెడ పట్టుకుని తోసినట్టు తెలుస్తోంది. బాలయ్య తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెందిన అభిమానులు నిరసనగా ఆయన ఫ్లెక్సీలను, టీడీపీ జెండాలను తగులబెట్టారు. అభిమానంతో వస్తే అవమానిస్తారా అంటూ ఆవేదన చెందారు. ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న ఆదరణ ఇలా బాలయ్య ప్రవర్తనతో ఇంకొంత డ్యామేజ్ అయింది. మొత్తానికి నిన్నటి బాలయ్య ఎపిసోడ్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా తయారైంది.