బాల‌కృష్ణ దెబ్బ‌కి.. ఊహించ‌ని చిక్కుల్లో చంద్ర‌బాబు..!

Thursday, January 10th, 2019, 12:15:42 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, తాజాగా విడుద‌లైన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు పెద్ద షాకే ఇచ్చింద‌ని సినీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా తాజాగా ఎన్టీఆర్ క‌థానాయకుడు చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటిస్తుంది.

ఈ క్ర‌మంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకునేందుకు వెళ్లిన ఎన్టీఆర్, నాగేశ్వరరావులను మదరాసీలుగా సంభోదిస్తారు. దీంతో ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ముందే తీవ్ర స్వరంతో తాము మదరాసీలం కాదని..ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని గట్టిగా మాట్లాడతారు. నాగేశ్వరరావు కూడా ఆయనకు జత కలుస్తారు.దీంతో ఆ సమయంలో ఇందిర చిన్నబుచ్చుకుంటారు.

ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ చేసిన అరాచకాలు కొన్నింటిని, ఎన్టీఆర్ న‌టించిన ఒక సినిమాలో పెట్టాలని దర్శకులకు సూచిస్తారు. ముఖ్యంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్టీఆర్ ఏకంగా నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీపైనే వ్యంగాస్త్రాలు సంధించాలని కోరారని.. తామే ఆమె కొడుకు వరకే దాన్ని పరిమితం చేశామని డైలాగ్ కూడా సినిమాలో ఉంది. అంటే ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలా పోరాడింది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు.

అయితే ఇప్పుడు క‌థ మొత్తం మారింది. ఏ పార్టీకి అయితే వ్య‌తిరేకంగా తెలుగుదేశంపార్టీ పుట్టిందో, ఇప్పుడు అదే పార్టీతో కొత్త కాపురం స్టార్ట్ చేశారు చంద్ర‌బాబు. ప్ర‌స్తుతం రాహుల్- బాబుల దోస్తీని చూసి టీడీపీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎవ‌రేమ‌నుకున్నా చంద్ర‌బాబు మాత్రం కాంగ్రెస్‌తోనే వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో తాజాగా బాల‌య్య న‌టించిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో ఇందిరాగాంధీ పైనే వ్యంగ‌స్త్రాలు ఉండ‌డంతో రాహుల్ గాంధీ ఎలా రియాక్ట్ అవుతారో అని చంద్ర‌బాబుకు త‌ల‌పోటుగా మారింది. దీంతో ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డే అవకాశం ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.