నష్టపోయిన నిర్మాతకు టికెట్ ఇప్పించే పనిలో బాలయ్య ?

Wednesday, October 24th, 2018, 04:35:48 PM IST

ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలి అనే ఫార్ములాను భవ్య సిమెంట్స్ అధినేత భవ్యాస్ ఆనంద్ ప్రసాద్ చక్కగా ఫాలో అవుతున్నారు. గతేడాది నందమూరి బాలక్రిష్ణ హీరోగా భారీ బడ్జెట్ వెచ్చించి ‘పైసా వసూల్’ అనే సినిమా నిర్మించారాయన. కానీ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్రసాద్ పెద్ద మొత్తంలోనే నష్టపోయారు.

అందుకే ఆయనకు న్యాయం చేయాలని నిర్ణయించుకుని ఈసారి జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ఆనంద్ ప్రసాద్ కు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారట బాలక్రిష్ణ . పార్టీలో ఎలాగూ మంచి పలుకుబడి, వియ్యంకుడి వద్ద మాట చెల్లుబాటయ్యే పరిస్థితి ఉన్నాయి, అలాగే ఎన్నికల్ని మోయగల సామర్థ్యం ఆనంద్ ప్రసాద్ కు పుష్కలంగా ఉంది కాబట్టి టికెట్ ఆయనకే అన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఈ టికెట్ కోసం మువ్వా సత్యనారాయణ కూడా బలంగానే ట్రై చేస్తున్నారు. ఆయనకు కూడ అంగ బలం, ఆర్ధిక బలం రెండూ బాగున్నాయి. మరి బావమరిది మాట విని చంద్రబాబు సత్యనారాయణను పక్కనబెట్టి ఆనంద్ ప్రసాద్ కు టికెట్ కేటాయిస్తారో లేదో చూడాలి.