బాల్ టాంపరింగ్ కేసు : ఆ ముగ్గురిపై ఏడాది నిషేధం విధించనున్నారా?

Tuesday, March 27th, 2018, 10:39:35 AM IST

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో ‘బాల్‌ టాంపరింగ్‌’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదంతం ఆ దేశ క్రికెట్‌ వ్యవస్థనే కుదిపేస్తోంది. ఓవైపు మాజీలు, మరోవైపు మీడియా సంస్థలు, ఇంకోవైపు అభిమానులు, ఇలా అన్ని వర్గాల్లోనూ స్మిత్‌ సేనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆలస్యం చేయకుండా టాంపరింగ్‌ ఉదంతంపై స్వీయ విచారణ మొదలుపెట్టింది. బోర్డు అధికారి దక్షిణాఫ్రికాకు చేరుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లను విచారిస్తున్నారు. విచారణ నివేదిక ఆధారంగా అతను స్మిత్‌, వార్నర్‌ల భవితవ్యంపై మంగళవారం రాత్రి కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లపై కొరడా ఝుళిపించడం ఖాయమని, వారు ముగ్గురిపై వేటు పడడం ఖాయమని సమాచారం అందుతోంది.

ఆసీస్‌ ప్లేయర్లను కఠినంగా శిక్షించాల్సిందేనని, అలా చేస్తేనే జెంటిల్మన్‌ గేమ్‌ పట్ల భవిష్యత్‌ తరాలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఎంసీసీ ఉపకార్యదర్శి జాన్‌ స్టీఫెన్‌సన్‌ అభిప్రాయపడ్డారు.
జట్టు సభ్యులంతా ముందే చర్చించుకుని ట్యాంపరింగ్‌ కుట్రను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన స్మిత్‌. ఇందులో కోచింగ్‌ స్టాఫ్‌ ప్రమేయమేది లేదని అన్నాడు. కాగా, స్మిత్‌ చెప్పినదాంట్లో అర్థంలేదని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. కుట్రలో కోచ్‌ లీమన్‌కు ప్రమేయం లేదంటే, జట్టుపై అతనికి పట్టులేనట్టు అర్థం. ఒకవేళ ప్రమేయం ఉందని తేలితే ఆటగాళ్లతోపాటు అతనూ దోషే అవుతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ లీమన్‌ తప్పుచేసినవాడే అవుతాడు అని క్లార్క్‌ వ్యాఖ్యానించాడు. అయితే ఈ మంగళవారం వారిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు….