వీడియో: అంపైర్ పైకి బాల్ విసిరారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Friday, April 13th, 2018, 09:40:24 PM IST

ఉప్పల్ వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య రసవత్తర పోరు జరిగిన విషయం తెలిసిందే. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా చాలా వేగంగా చెలరేగి ఆడుతున్నారు. ఈ సమయంలోనే ఫీల్డ్ అంపైర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు అంపైరుకు తీవ్రమైన గాయంకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ ఆఖరి బంతిని ధావన్ బౌండరీ బాదాడు. ఆరు ఓవర్లు ముగిసిన తరువాత ఫీల్డ్ అంపైర్ సీకే నందన్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లో భాగంగా బ్రేక్ ఇస్తున్నట్లు తన చేతిని ఎత్తి చూపిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లకు చెప్పాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఇదే సమయంలో అకస్మాత్తుగా ముంబయి ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వచ్చి నందన్ తలకు తాకింది. ముంబయి ఆటగాళ్లు కృనాల్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ అంపైర్ దగ్గరకు వెళ్లి పరామర్శించారు. గాయం పెద్దది కాకపోవడంతో కొద్దిసేపు ఇబ్బంది పడిన నందన్.. తరువాత యాథావిధిగా మ్యాచ్‌లో అంపైరింగ్ చేశాడు.