బండారు దత్తాత్రేయ కుమారుడు మృతి!

Wednesday, May 23rd, 2018, 09:08:34 AM IST

ప్రస్తుతం నడుస్తున్న కాలంలో ఎప్పుడు ఎవరికి ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం అవుతోంది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు నిర్ణీత వయసు దాటిన పెద్దవారికి మాత్రమే వచ్చే షుగర్, బిపి, హార్ట్ అటాక్ వంటివి నేడు చిన్న, పెద్ద అనే వయోబేధం లేకుండా వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నేటి పరిస్థితులు, ఆహార అలవాట్లు, అలానే మన జీవన విధానం కూడా అని వైద్యులు చెపుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బిజెపి నేత బండారు దత్తాత్రేయ కుమారుడు నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం ఎంబిబిఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న 21ఏళ్ళ వయసు మాత్రమే గల వైష్ణవ్ ఇలా హఠాన్మరణం చెందాడనే వార్త నిజంగా విన్న వారందరి మనసుల్ని కలిచి వేస్తుంది. వివరాల్లోకి వెళితే, రోజూ ఎంతో చలాకీగా వుండే వైష్ణవ్ నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో వున్నట్లుండి కుప్పకూలాడు.

వైష్ణవ్ కి ఏమైందో అని కంగారుపడ్డ కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని ముషీరాబాద్ గురునానక్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటలపాటు డాక్టర్లు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. అయితే వైష్ణవ్ మరణవార్తను విని దత్తాత్రేయ, ఆయన సతీమణి కంగారుపడతారేమోనని ఇతర కుటుంబ సభ్యులు ఆ విషయాన్నీ ఉదయం వరకు దత్తాత్రేయ దంపతులకు తెలియకుండా దాచారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఉదయం 5 గంటల సమయంలో తల్లితండ్రులకు తెలియపరిచారు. ఆ వార్త విన్న దత్తాత్రేయ, ఆయన సతీమణి ఒక్కసారిగా కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రస్తుతం వైష్ణవ్ మృతదేహాన్ని దత్తాత్రేయ ఇంటికి తరలించారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్ మోహన్, బిజెపి నేత లక్ష్మణ్ తదితరులు దత్తాత్రేయను పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం బిజెపి, ఇతర పార్టీల నేతలు ఒక్కరొక్కరుగా దత్తాత్రేయ ఇంటికి చేరుకొని ఆయన కుమారుడి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments