ప‌వ‌న్ గురించి బండ్ల చెప్పిన షాకింగ్ నిజాలు!

Thursday, October 4th, 2018, 01:01:54 AM IST


బ్లాక్‌బ‌స్ట‌ర్ బండ్ల గ‌ణేష్‌లో ఫక్తు రాజ‌కీయ నాయ‌కుడు క‌నిపిస్తున్నాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌లే ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ- పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న బండ్ల ఆ త‌ర్వాత నేరుగా టీవీ9కి వెళ్లి ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. అక్క‌డ త‌న‌ని ప్ర‌శ్నిస్తున్న ముర‌ళీకృష్ణ‌కే బండ్ల ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే స‌మాధానాలిచ్చాడు. త‌న‌లో రాజ‌కీయ‌నాయ‌కుడికి చాలానే ముంద‌స్తు ప్రిప‌రేష‌న్ ఉంద‌ని బండ్ల నేరుగా టీవీ లైవ్‌లోనే చూపించాడు.

అదంతా స‌రే.. బండ్ల గ‌ణేష్ గురించి లోకం ప‌లు ర‌కాలుగా మాట్లాడుకోవ‌డం విన్నాం. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి వ్య‌తిరేకంగా వెళుతున్నాడ‌ని, క్లోజ్ బ‌డ్డీ అయిన పూరీతో గొడ‌వ ప‌డ్డాడ‌ని, అలానే హీరో స‌చిన్ జోషితో ఇంకా కోర్టు గొడ‌వ‌లున్నాయ‌ని ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతుంటారు. అయితే వీట‌న్నిటికీ బండ్ల ఇచ్చిన స‌మాధానాలు పెద్ద షాకిస్తున్నాయి. తాను ఏం మాట్లాడినా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి మ‌రీ మాట్లాడుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

రాజకీయాల్లోకి వ‌స్తే సినిమాలకు దూరం అయిన‌ట్టు కాదు. దేనిప‌ని దానిదే. సినిమా అనేది నా వృత్తి. సినిమా పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉంటా. నా సంపాదన సినిమా నుంచే ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్లి సేవ చేస్తాను అంతే. రూ.70, రూ.80 కోట్ల బ‌డ్జెట్ల‌తోనూ సినిమాలు చేశాను. పవన్ దయతోనే నిర్మాతనయ్యాను. ప‌వ‌న్ నా దేవుడు ఎప్ప‌టికీ.. అని అనేశాడు. అలానే ఎంపీగా ఉన్నప్పటి నుంచే బొత్స సత్యనారాయణతో మంచి అనుబంధం ఉండ‌డం వ‌ల్ల త‌న‌ను బినామీ అనేస్తుంటార‌ని తెలిపాడు. పవన్ కల్యాణ్ దయతో.. ప‌వ‌న్ పెట్టిన‌ భిక్షతోనే ఇలా ఉన్నానని చెప్పాడు. నా ఫ్రెండు పూరి జగన్నాథ్‌తో గొడవ ముగిసింది. త‌న‌కు రూ.40 లక్షలు పెట్టి లైటర్ కొనిచ్చాను. కానీ దానికి అయ్యింది కేవలం రూ.10 లక్షలు మాత్రమే. అందులో తప్పేమీ లేదు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ వాళ్లు పన్ను కట్టమని చెప్పారు. నేను పన్ను కట్టేశాను. దాంతో ఆ గొడవ ముగిసిపోయింది… అని తెలిపాడు. ఎన్టీఆర్, ర‌వితేజ‌, స‌చిన్‌ల‌తో విభేధాలు తొల‌గిపోయాయి. హీరోల‌తో విభేధాలు ఉన్నంత మాత్రాన నాపై వ్య‌తిరేక‌త రాదు. సినిమా వాళ్లంతా మంచివాళ్లు… అని తన‌దైన శైలిలో చాలానే చెప్పాడు బండ్ల‌.