కేబినెట్ భేటీ – ‘బంగారుతల్లి’పై వాదన

Saturday, June 8th, 2013, 11:26:00 AM IST


మూడు నెలల తర్వాత రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. మూడున్నర గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బంగారు తల్లి పథకంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండుగా విభజించాలన్న ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాజీవ్ స్వగృహలో నిర్మాణాలు పూర్తైన ఇళ్లను రెండు దశల్లో లబ్దిదారులకు అందించేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం మంజూరు, వైద్య శాఖలో 748 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. భేటీలో ‘బంగారు తల్లి’ పథకంపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పిసిసి చీఫ్ బొత్స, జానా పథకం గురించి ముందే చర్చించి ప్రకటిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరకు బంగారు తల్లి’పై కేబినెట్ సబ్ కమిటీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బంగారు తల్లికి చట్టబద్ధత కల్పించేలా ప్లాన్ చేయాలని కేబినెట్ తీర్మానించింది.

జూన్ మూడో వారంలో పంచాయతీ ఎన్నికలు.. సెప్టెంబర్లో మున్సిపల్ పోల్స్ ఆతర్వాత మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ లో ఏకాభిప్రాయం కుదిరింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సన్నద్దం కావాలని నిర్ణయించారు. ఎన్నికల్లో గెలుపు బాధ్యత ను సీఎం ఇంచార్జ్ మంత్రులకు అప్పగించారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై శనివారం మరోసారి భేటీ కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుబాటులో ఉన్న మంత్రులంతా ఈ భేటీకి రావాలని సీఎం కోరారు.

రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మాణం పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు రెండు దశల్లో అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ను రెండగా విభజించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ నియమించనున్నారు. ఒక అధ్యక్షుడు ఐదుగురు సభ్యులతో ఎస్టీకమిషన్ ఏర్పాటు కానుంది. బ్రహ్మణి స్టీల్స్ కు కేటాయించిన 10,670 ఎరపావ భూ కేటాయింపుల రద్దుకు ఆమోదం తెలిపింది. వస్త్రాలపై గతంలో విధించిన ఐదు శాతం వ్యాట్ ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2009లో మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు రంగారెడ్డి జిల్లా గాజులరామారంలో రెండు వందల గజాల చొప్పున ఇళ్లస్థలాలు కేటాయించాలని నిర్ణయించారు

క్యాబినెట్ బేటీలో పలు పాలనాపరమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వైద్య విద్యా శాఖలో 748 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది., ప్రభుత్వోద్యోగులకు 6.8 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు 160 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. పెంచిన కరవు భత్యాన్ని జీపీఎంప్ లో నేరుగా జమచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నెలకు రెండుసార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. రెండు శుక్రవారాలు సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు మంత్రి డీకే తెలిపారు.