బి అలెర్ట్ : ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు?

Monday, April 2nd, 2018, 03:00:25 PM IST

ఒకప్పుడు మనం ఎవరినైనా సంప్రదించాలంటే ప్రధమంగా ఒక మామూలు మెసేజ్ చేయడం, హాయ్ అని చెప్పడం, వంటి వాటితో మొదలుపెడుతుంటాం. అయితే రాను రాను కాలం మార్పు వల్ల జరుగుతున్న పరిణామాలు, అలానే టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కి తర్వాత ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం చాలామంది, మాములు మెస్సేజెస్ వాడడం మానేసి, నిద్ర లేచి గుడ్ మార్నింగ్ చెప్పడం మొదలు, రాత్రి గుడ్ నైట్ చెప్పడం వరకు చాలా సమయం వాట్సాప్ లోనే గడపడం చూస్తుంటాం. అయితే ఎక్కువమందికి అతి చేరువైన ఈ యాప్ ప్రస్తుతం ప్రమాద బారిన పడినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం వాట్సాప్‌ యూజర్లను టార్గెట్‌ చేసిన ఒక కొత్త యాప్‌, యూజర్లు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, ఎవరితో ఛాటింగ్‌ చేస్తున్నారు వంటి వివరాలను బహిర్గతం చేస్తోందనే వార్త సోషల్ మీడియా లో కలకలం రేపుతోంది. ఈ యాప్‌ పేరు ఛాట్‌వాచ్‌గా తెలుస్తోంది. ఛాట్‌డబ్ల్యూగా అనే ఈ యాప్‌ ద్వారా మీ వాట్సాప్‌ కాంటాక్ట్ లో ఉండేవారు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, ఎప్పుడు ఎవరితో ఛాటింగ్‌ చేసుకుంటున్నారు, వంటివి రాబట్టవచ్చని తెలుస్తోంది. లాస్ట్‌ సీన్‌ ఆప్షన్ తీసేసినప్పటికీ, వాట్సాప్‌ కాంటాక్ట్‌ల యాక్టివిటీని ఇది కనిపెట్టేస్తుందట. అయితే ఈ యాప్‌ ఉచితంగా కాకుండా, వారానికి రూ.140 చెల్లించి దీన్ని వాడుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

గత కొన్ని రోజుల వరకు గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఫోన్‌ ఐఓఎస్‌ యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ ఛాట్‌డబ్ల్యూ యాప్‌, ఒక్కసారిగా రిపోర్టులు వాట్సాప్‌ యూజర్లను అలర్ట్‌ చేయడం ప్రారంభించిన తర్వాత ప్లే స్టోర్ నుండి దీన్ని డిలీట్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే పలు వెబ్‌సైట్లలో దీని ఏపీకే అందుబాటులో ఉందని, దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి వీలుంటుందని, వాట్సాప్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. ఏ సమయంలో మీ వాట్సాప్‌ స్నేహితులు నిద్రపోతున్నారు, ఏ సమయంలో లేస్తున్నారు, ఏ సమయంలో ఛాటింగ్‌ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా ఛాట్‌ చేస్తున్నారు వంటి వివరాలను ఈ యాప్‌ బహిర్గతం చేస్తోందని తెలుస్తోంది.

ఈ యాప్‌తో మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల, ఉద్యోగుల వాట్సాప్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ యాక్టివిటీ ఇట్టే పట్టేయొచ్చట. అయితే వాట్సాప్‌ యాప్‌ ఫుల్‌ ఎండ్‌టూఎండ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉందని, మూడో వ్యక్తులు వాట్సాప్‌ యూజర్ల గోప్యతను దొంగలించడానికి అసలు కుదరదని, అదంతా బూటకమని ఓ వైపు ఆ కంపెనీ చెబుతున్నప్పటికీ, వాట్సాప్ యూజర్ల డేటా బహిర్గతం అవుతుందనే ఇటువంటి వార్తలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి….