వైరల్ పిక్స్ : పాక్ పై భారత్ గెలిచింది..మనసులు మాత్రం ఇద్దరూ గెలిచారు..!

Tuesday, January 30th, 2018, 03:24:30 PM IST

కుర్రాళ్ల క్రికెట్ సమరం తుది అంకానికి చేరుకుంది. అండర్ 19 ప్రపంచకప్ లో టీం ఇండియా మరియు ఆసీస్ జట్లు ఫైనల్ చేరాయి. శనివారం ఈ రెండు జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాక్ పై యువభారత్ అద్భుత విజయం సాధించింది. పాక్ తో మ్యాచ్ జరిగినప్పుడల్లా టీం ఇండియాపై ఉండే ఒత్తిడి తెలిసిందే. ఇలాంటి మ్యాచ్ లపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటన్నింటిని అధికమించి భారత కుర్రాళ్ళు కలసి కట్టుగా కుమ్మేసారు. ఒత్తిడి ప్రభావం ఏమాత్రం లేకుండా పాక్ ని చిత్తు చేశారు. పాక్ పై సాధించిన అద్భుత విజయానికి నలువైపుల నుంచి కుర్రాళ్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మ్యాచ్ లో పాక్ జట్టు ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ క్రీడా స్ఫూర్తి విషయంలో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రత్యకతని చాటుకున్నారు. ఇండియా – పాక్ మ్యాచ్ అంటే అభిమానుల్లో నెలకొని ఉండే భావోద్వేగాల గురించి సపరేటుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే తమ అభిమాన జట్టు నెగ్గి తీరాల్సిందే అని సగటు అభిమాని కోరుకుంటాడు. ఇరు దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. అందుకే ఇండియా – పాక్ జట్లు ఎప్పుడు తలపడిన ఆ మ్యాచ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొన్ని సార్లు ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని పక్కన పెట్టిన ఇరు జట్ల కుర్రాళ్లు క్రీడా స్ఫూర్తిని చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. సెమీస్ మ్యాచ్ సందర్భంగా కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం.

భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాక్ ఆటగాడు మన బ్యాట్స్ మాన్ షూ లేస్ ని సరిచేశాడు. పాక్ బ్యాటింగ్ సమయంలో భారత ఆటగాడు ప్రత్యర్థి బ్యాట్స్ మాన్ షూ లేస్ సరిచేసి దృశ్యాలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఈ మ్యాచ్ లో పరస్పర అభినందనలు కూడా కనిపించాయి. క్రీడా స్పూర్తని చాటుకున్న ఆటగాళ్లపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.