ఎమిరేట్స్ నిర్లక్ష్యం : భర్త పాస్ పోర్ట్ తో భార్య విమాన ప్రయాణం

Thursday, May 3rd, 2018, 05:00:54 PM IST

ఈ మధ్య కాలంలో ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా పలు ఎయిర్ లైన్స్ సంస్థల పేర్లు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సార్లు ప్రయాణికుల పొరపాటు ఉన్నప్పటికీ….చాలా సార్లు సిబ్బంది అత్యుత్సాహం….వల్ల ప్రయాణికులు నానా పాట్లు పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఓ భారత మహిళా ప్రయాణికురాలు తీవ్రంగా ఇబ్బంది పడింది. మాంచెస్టర్ కు చెందిన భారత మహిళ గీతా మోధా….పొరపాటున తన భర్త పాస్ పోర్టుతో ప్రయాణించినా….సిబ్బంది గుర్తించ లేదు. దీంతో ఆమె ఢిల్లీలో ల్యాండ్ అవగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటన కలకలం రేపడంతో ఎమిరేట్స్ యాజమాన్యం…ఈ ఘటన పై విచారణకు ఆదేశించింది.

మాంచెస్టర్ కు చెందిన గీతా మోధా….ఏప్రిల్ 23న మాంచెస్టర్ నుంచి దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానంలో ఢిల్లీకి బయలుదేరింది. అయితే హడావిడిలో పొరపాటున ఆమె తన భర్త దిలీప్ పాస్ పోర్టును తీసుకువచ్చింది. అయితే మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో ఆమె ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ విషయాన్ని గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో గీతా తీవ్ర అసహనానికి లోనైంది. మాంచెస్టర్ లో చెక్ ఇన్ సమయంలోనే ఈ పొరపాటును ఎమిరేట్స్ సిబ్బంది గుర్తించి ఉంటే ఇదంతా జరిగి ఉండేదికాదని ఆమె వాపోయింది. తన వద్ద ఉన్న అధిక లగేజీని తగ్గించడంపై సిబ్బంది దృష్టి సారించారని…కానీ ముఖ్యమైన పాస్ పోర్టు విషయాన్ని వదిలేశారని అసహనం వ్యక్తం చేసింది. అయితే జరిగిన పొరపాటుకు గీతకు ఎమిరేట్స్ సంస్థ క్షమాపణలు చెప్పింది. గీత పాస్ పోర్టును ఆ ఎయిర్ లైన్స్ సిబ్బంది దుబాయ్ వరకు చేర్చారు. దానిని తీసుకువచ్చేందుకు ఆమె దుబాయ్ కు వెళ్లింది.