సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఢిల్లీలో అల్లకల్లోలం…

Friday, April 13th, 2018, 11:18:33 AM IST

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీఎస్టీ చట్టాన్ని నీరుగార్చింది. కోర్టు ఆదేశాల వల్ల దేశానికి తీరని నష్టం వాటిల్లింది. చట్టంలోని కఠినమైన నిబంధనలను సడలించడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఆ తీర్పులో స్పష్టత కనిపించక ప్రజలలో అయోమయం ఏర్పడింది. దాంతో సమాజంలో సామరస్యభావన కరువైందన్న అబిప్రాయం నెలకొన్నది అని దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం స్పష్టం చేసింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గురువారం సుప్రీంకోర్టుకు లిఖిత పూర్వకంగా సమర్చించిన వాదనల్లో ఈ విషయాలు పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, ఈ కేసుల్లో అనవసరంగా నిందితులుగా చేర్చడం వల్ల అమాయకులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ నిందితుల తక్షణ అరెస్ట్ నిబంధనను సడలిస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులను ఎస్సీఎస్టీ కేసుల్లో నిందితులుగా పేర్కొంటే వారిపై ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత సంబంధిత ఉన్నతాధికారి అనుమతితోనే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎస్సీవర్గాలు, దళిత సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారిచ్చిన పిలుపుతో ఈనెల రెండోతేదీన భారత్ బంద్ జరుగడం, ఈ సందర్భంగా కొన్ని రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు, ఘర్షణలు జరిగి 8 మందికి పైగా మరణించగా, పలువురు గాయపడడం, ఆస్తుల విధ్వంసం, పరస్పర దాడులు జరుగడం సంగతి తెలిసిందే. మార్చి 20 నాటి ఆదేశాలపై ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన కేంద్రం, ఇప్పుడు లిఖిత పూర్వక వాదనల్లో ఆ విషయాలను ప్రస్తావించింది.

చాలా సున్నితమైన అంశంపై మీ ఆదేశాలే దేశంలో అలజడికి, ఆందోళనకు, హింసకు కారణమయ్యాయని, కాబట్టి మీ తీర్పును సవరించాల్సిన అవసరం ఉన్నదని, ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థల అధికారాలను మార్చి 20 నాటి తీర్పు భంగపరిచిందని కూడా కేంద్రం ఈ సందర్భంగా ఘాటుగానే తెలిపింది. చట్టాలు చేసే అధికారం తనకు లేకున్నా ఆ పని చేయవచ్చుననే విధంగా కోర్టు వ్యవహరించిందని కేంద్రం వ్యాఖ్యానించింది. మన రాజ్యాంగం శాసన, న్యాయవ్యవస్థలకు వేరువేరు అధికారాలు ఇచ్చిందని, వాటికి భిన్నంగా పని చేయరాదని కోరింది. ఈ తీర్పు ఎస్సీ ఎస్టీ చటాన్ని సడలించింది. 1973 క్రిమినల్ ప్రొసీజర్‌లోని నిబంధనలను నీరుగార్చింది. దీని వల్ల దేశానికి చాలా నష్టం జరిగింది. కాబట్టి మీ ఆదేశాలకు సంబంధించి 83(3)-(5) పేరాల్లో పేర్కొన్న విషయాలను తిరిగి సమీక్షించాలి. తీర్పును తప్పుగా అర్థంచేసుకునే అవకాశాలు లేకుండా చేయాలి. చట్టం యథావిధిగా అమలుకావడంపై ప్రభావం పడని విధంగా, ఆదేశాలను వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఏజీ వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారం క్రితం ఇదే విధంగా కోరినా ఇచ్చి న ఆదేశాలు ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. కనీసం ఆ ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని అభ్యర్థించినా ససేమిరా అంది.