బెజవాడపై కన్నేసిన భూ”చోర్లు”

Saturday, March 3rd, 2018, 12:03:04 PM IST

స్టేట్ట్ క్యాపిటల్ అయినా సెంట్రల్ క్యాపిటల్ అయినా అభివృద్దికి, పెట్టుబడి దారులకి నెలవు కావాలి. ఇక్కడ ఉన్న… కొన్న ఆస్తులకు ఎలాంటి చోరీలకు గురికావన్న భరోసా ఉండాలి. అప్పుడే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు, అభివృద్దీ జరుగుతుంది. కానీ కనక దుర్గ కన్న ఊరు విజయవాడలో ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఖాళీగా ఉన్న స్థలం కనిపిస్తే చాలు కబ్జాలకు గురి కాక తప్పట్లేదు. నకిలీ భూపత్రాలను సృష్టించేసి ఆ భూమి తమదేనంటూ దురాక్రమణకు దిగుతున్నారు. కొందరు రాజకీయ నాయకులే.. తెర వెనుక ఉంటూ తమ అనుచరుల ద్వారా ఈ ఈ అక్రమ దందాలను నడిపిస్తుండటంతో మధ్యతరగతి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అన్యాయమవుతున్నాయి. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు మౌనంగా వ్యవహరిస్తుంది.

ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా నిన్న విశాఖలో భూ మాఫియా ఎలా చెలరేగిపోయిందో ఇప్పుడు బెజవాడలో అచ్చం అలాగే జరుగుతోంది. నిజంగా చెప్పాలంటే బెజవాడలో అంతకంటే అతి తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. రాజధాని నగరంగా రూపుదిద్దుకున్న తర్వాత అజిత్‌సింగ్‌నగర్‌, భవానీపురం, ఇబ్రహీంపట్నం, పాయకాపురం తదితర శివారు ప్రాంతాల్లోని భూముల విలువ ఒక్కసారిగా అనేక రెట్లు పెరిగిపోవడంతో ఖాళీగా ఉన్న స్థలాలపై కన్నేసి, వాటికి సంబంధించిన నకిలీ భూపత్రాలు సృష్టించి ఆ భూమిలో టెంట్ వేస్కొని కుర్చుంటున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని కొందరు అధికారులు నకిలీ ఆస్తి పత్రాల తయారీలో ఈ ముఠాలకు రహస్యంగా చేతులందిస్తున్నారు. స్థలం కబ్జాకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సివిల్‌ కేసులంటు వారు అందులో జోక్యం చేసుకోవడం లేదు. దీంతో కబ్జా రాయుల్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.