61 మార్కులు వస్తే 4 వేశారు..ఘోర తప్పిదం ఎలా బయటపడిందంటే..!

Sunday, October 22nd, 2017, 01:08:12 PM IST

బీహార్ లో విద్యావ్యవస్థ ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారి ఉంటాయి. చదువు పై ఆసక్తి కనబరిచే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం కూడా ఉండదు. పైగా ఇలాంటి ఘోరతప్పిదాలు జరుగుతాయి. ఓ విద్యార్థిని విషయంలో పాఠశాల బోర్డు చేసిన అన్యాయం విస్మయానికి గురిచేస్తోంది. తప్పుని గ్రహించిన హై కోర్ట్ పాఠశాల బోర్డుకు చివాట్లు పెట్టి తగిన శాస్తి చేసింది.

అసలేం జరిగిందంటే.. పదో తరగతి విద్యార్థిని అయిన ప్రియాంక పరీక్షల్లో రెండు సబ్జెక్టు లలో తప్పింది. ఆమెకు సైన్సు లో 29 మార్కులు, సంస్కృతంలో 4 మార్కులు వచ్చాయి. తాను ఫెయిల్ అయ్యే స్టూడెంట్ ని కాదని కచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతానని నమ్మకం ఉండడంతో రీ వెరిఫికేషన్ చేయించింది. ఈ సారి కూడా ప్రియాంకకు నిరాశే ఎదురైంది. సంస్కృతంలో 4 మార్కులకు బదులుగా 9 వేశారు. సైన్సులో 29 నుంచి 7 మార్కులకు తగ్గించారు. కానీ ప్రియాంక నమ్మకం కోల్పోకుండా తనకు అన్యాయం జరిగిందని పాట్నా హై కోర్ట్ ని ఆశ్రయించింది. మొదట న్యాయ మూర్తి ప్రియాంక మాటలని నమ్మలేదు.

విచారణ జరగాలంటే 40 వేలు డిపాజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి ప్రియాంకకు సూచించారు. ప్రియాంక అలాగే చేయడంతో ఆమె పరీక్ష పేపర్లని కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి పాఠశాల ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ని ఆదేశించారు. జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన విద్యా శాఖ వేరే విద్యార్థి పేపర్ లని సమర్పించింది. ప్రియాంక చేతి రాతకు, ఆ పేపర్ లలోని చేతి రాతకు ఉన్న తేడా న్యాయమూర్తికి స్పష్టంగా అర్థం అయింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయ మూర్తి విద్యాశాఖపై చివాట్లు పెట్టారు. ప్రియాంక అసలైన పేపర్లు సమర్పించాలని ఆదేశించారు. ఆమె పేపర్ లని పరిశీలించి వెరిఫై చేయగా సైన్సులో 80 మార్కులు, సంస్కృతం లో 61 మార్కులు వచ్చాయి. విద్యార్థినికి జరిగిన అన్యాయానికి బదులుగా విద్యాశాఖ వెంటనే ఆమెకు రూ 5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునివ్వడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments