బిల్ గేట్స్ ప్రశంసల్లో ఆధార్

Friday, May 4th, 2018, 11:20:47 AM IST

భారతదేశంలో అమలు చేస్తున్న ఆధార్ ప్రక్రియ ఎంతో ఉన్నతమైనదని, దానితో ఎన్నో ప్రయోజనాలున్నాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అభివర్ణించారు. దాని వాళ్ళ ముందు ముందు చాలా ఉపయోగాలున్నాయని ఆధార్ ప్రక్రియను ప్రవేశపెట్టడం ఒక గొప్ప ప్రక్రియ అని అన్నారు. ఆధార్‌తో పరిపాలనలో నాణ్యత పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సాధికారత పొందుతారని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఈ విశిష్ట గుర్తింపు విధానాన్ని ఇతర దేశాలు కూడా భవిష్యత్తులో అనుసరించవచ్చని చెప్పారు. ఇతర దేశాల్లో ఆధార్ తరహా విధానాన్ని అమలు చేసేందుకు తమ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన తరఫున ప్రపంచబ్యాంక్‌కు నిధులు అందజేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఆధార్ ప్రధాన రూపకర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ప్రపంచబ్యాంక్‌కు సహకరిస్తున్నారని బిల్‌గేట్స్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌లో వందకోట్ల మందికి పైగా భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని బిల్‌గేట్స్ గుర్తు చేశారు. అది కేవలం బయో ఐడీ తనిఖీ పథకం అయినందున వ్యక్తుల గోప్యతకు ఎటువంటి నష్టం ఉండదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే దేశం ఈ ఆధార్ వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని దానికి ప్రస్తుతం దేశంలో వస్తున్న ఆర్ధిక మార్పిలే నిలువెత్తు సాక్ష్యాలని ఆయన తెలిపారు

Comments