టీఆర్ఎస్ ఎమ్యెల్యే కు చేదు అనుభవం!

Wednesday, January 24th, 2018, 09:17:38 AM IST

ఎంతో మంది త్యాగాల ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం, ఈ నూతన రాష్ట్రాన్ని తన వంతుగా అన్ని విధాలా అభివృద్ధి పధంలో నడిపించి ప్రగతి పథాన నిలబెట్టాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే వున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందరికి 24 గంటలు విద్యుత్తు, మరియు నీరు అన్నివిధాలా అందేలా ప్రయత్నాలు చేస్తున్నారనేది నగ్న సత్యం. ఈ విషయమై ఇటీవల జరిగిన ఒక సంఘటన టీఆర్ఎస్ శ్రేణులలో తీవ్ర సంచలనం రేపుతోంది. పెద్దపల్లి ఎమ్యెల్యే దాసరి మనోహర్ రెడ్డి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారం కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ప్రజలందరికి తెలిసిన విషయం. అయితే అదే మండలానికి చెందిన గంగవరం గ్రామ రైతులు ప్రభుత్వం తమ పంట పొలాలకు సకాలంలో నీరు అందివ్వటంలేదని, ఈ విషయమై పండుగకు వస్తున్న ఎమ్యెల్యే ని నిలదీయాలని దారికాశారు. రైతులని చూసిన ఎమ్యెల్యే మనోహర్రెడ్డి కారుదిగి వచ్చి వారిని శాంతపరిచే ప్రయత్నం చేశారు. పొలాలకు ఎస్ఆర్ఎస్పి నుంచి నీరు విడుదలలో జాప్యం జరుగుతోందని వారు గట్టిగా ఆయన్ని నిలదీశారు. ప్రభుత్వం నీరు అందీస్తుందన్న హామీతో వందల ఎకరాలలో పంటలు వేసామని, ఇప్పుడు సకాలం లో నీరు రాకపోవడం వల్ల అవి ఎండిపోయి నాశనం అయ్యాయని ప్రశ్నించడంతో, తన వద్ద సరైన సమాధానం లేక నీళ్లు నమిలిన మనోహర్ రెడ్డి, అక్కడనుండి వెళ్లిపోయే ప్రయత్రం చేసారని, ఆగ్రహంతో వున్న రైతులు ఆయన్ని వెంబడించారని, చివరికి పోలీస్ ల జోక్యంతో మనోహర్ రెడ్డి ని అక్కడ నుండి సురక్షితంగా గ్రామం దాటించారని తెలుస్తోంది. ఈ మొత్తం విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖా మంత్రి హరీష్ రావు కాస్త ఆగ్రహంగా ఉన్నారని, అయితే ఈ విషయమై ఆయన ఇంతవరకు అధికారికంగా స్పందించలేదని తెలుస్తోంది. చివరకు అధిష్టానం వరకు చేరినఈ ఘటనను పార్టీ వర్గాలు కొంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత వున్నవిషయం ఈ ఘటన ద్వారా కొంత మేరకు వెలుగులోకి వచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి…