అద్వానీ లేకుండా బీజేపీ సమావేశాలు

Friday, June 7th, 2013, 05:39:19 PM IST

నేటి నుంచి గోవా రాజధాని పనాజీలో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సీనియర్ నేత అద్వానీ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల అద్వానీ హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. శని, ఆదివారాలలో జరిగే సమావేశాలకు అద్వానీ హాజరవుతారని చెప్పాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ పాత్ర ఏమిటి అనే దానిపై ఈ సమావేశాలలో చర్చ జరగనుందని తెలుస్తోంది.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించాల్సిన బాధ్యతలపై గోవాలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం ఉంటుందని భావిస్తున్నా.. దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీకి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఓ వైపు బీజేపీ రెడీ అవుతూ ఉండగానే ఆ పార్టీ మిత్రపక్షం జేడీయూ మరోసారి ఆయనపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ప్రధానిగా మోడీ తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జేడీయూ నేత నీరజ్ కుమార్ తెలిపారు. మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే తమ దారి తాము చూసుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు.

బీజేపీలో పెరిగిపోతున్న మోడీ జపంపై సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రధాని పదవికి ఎవరు ఉండాలన్న విషయం తప్ప దేశ ప్రజల గురించి పట్టించుకోరా అని ఆ పార్టీ నేత నరేష్ అగర్వాల్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ కి ఏనాడూ శ్రద్ధ లేదని నరేష్ ఆరోపించారు.

అటు బీజేపీ నేతలు కూడా మోడీ ప్రమోషన్ పై సంకేతాలు ఇస్తున్నారు. గోవా సమావేశాల తర్వాత మోడీ పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారబోతున్నారని బీజేపీ సీనియర్ నేత బల్బీర్ పుంజ్ అన్నారు. మోడీ పార్టీలో అందరికీ కావాల్సిన వ్యక్తని ఆయన తెలిపారు. గోవా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ ఉంటుందని బల్బీర్ పుంజ్ తెలిపారు.