పార్టీ ప్రచారాలకోసం మోదీ చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా..?

Tuesday, May 15th, 2018, 11:00:29 AM IST

సాధారణంగా కేంద్ర పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా తమ ప్రచారాల కోసం పత్రీ పార్టీ ఏటా ఎంతో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఎంత అవసరం ఉన్నది ఎంత మేరకు ఖర్చు పెడుతున్నామన్నదే చాలా ముఖ్యమైన విషయం. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రచారం కోసం చేసిన ఖర్చు గురించి సర్వే చేయగా ఒక విషయం తేలింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్ల చొప్పున ప్రచారానికి ఖర్చు చేసింది. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మన దేశ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రచార ఖర్చు మొత్తం అక్షరాలా రూ.4,343 కోట్లు! అంటే నిజంగా నమ్మడానికి వీలు లేదు కదా. కానీ అది అక్షర సత్యం. ఆర్టీఐ కింద వచ్చిన ఓ దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ అవుట్‌రీచ్ కమ్యూనికేషన్ పై విధంగా వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు బహిరంగ ప్రచార కార్యక్రమాలకు కలిపి ఈ మొత్తం ఖర్చు చేసినట్టు సదరు కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలిపింది.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి వివిధ రకాల మాధ్యమాల ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేశామన్నది. ప్రింట్ మీడియాలో ప్రచారానికి రూ.1732.15 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి రూ.2079.87 కోట్లు, బహిరంగ ప్రచారానికి రూ.531.24 కోట్లు ఖర్చుచేశారు. ప్రింట్ మీడియాలోని న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు.. ఎలక్ట్రానిక్ మీడియాలోని టీవీ, ఇంటర్నెట్, రేడియో, డిజిటల్ సినిమా, ఎస్సెమ్మెస్‌లు.. బహిరంగ ప్రచారం విభాగంలో పోస్టర్లు, బ్యానర్లు, డిజిటల్ ప్యానెల్స్, హోర్డింగ్‌లు, రైల్వేటికెట్లు తదితర మాధ్యమాల ద్వారా మొత్తం రూ.4,343 కోట్లు ఖర్చుచేసినట్టు బ్యూరో ఆఫ్ అవుట్‌రీచ్ కమ్యూనికేషన్ తెలిపింది. అనిల్ గల్గాలీ అనే ఆర్టీఐ ఉద్యమకారుడు ఈ దరఖాస్తు చేశారు. మోదీ ప్రధాని కాకమునుపు కూడా ఏ పార్టీ కూడా ఇంత మొత్తంలో ఖర్చు చేయలేదని కానీ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం ప్రచారాల కోసం చాలా అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నాడని బ్యూరో ఆఫ్ అవుట్‌రీచ్ కమ్యూనికేషన్ వెల్లడించింది.

  •  
  •  
  •  
  •  

Comments