కర్ణాటకలో బిజెపి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది: రాహుల్ గాంధీ

Thursday, May 17th, 2018, 02:12:03 PM IST

మొత్తానికి కర్ణాటకలో ఎన్నికలు, వాటి ఫలితాలు రావడం, ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప ప్రమాణం చేయడం కూడా పూర్తి అయింది. అయితే ఇదంతా అంతసులువుగా ఏమి జరగలేదు మరి. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అక్కడ అత్యధిక సీట్లు సాధించిన బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమంతించిన గవర్నర్ నేడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతే కాదు బలనిరూపణకు 15 రోజుల గడువు కూడా ఇచ్చారు. అయితే గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మండిపడుతూ, రాజభవన్ ఎదుట తమ నిరసన తెలిపారు. అయితే దీనిపై ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షదుకు రాహుల్ గాంధీ ఫలితాల తర్వాత తొలిసారి మాట్లాడారు. ట్విట్టర్ వేదికగా ఆయన బిజెపిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

ఆయన మాట్లాడుతూ, ఎంతో అప్రజాస్వామికంగా, వంచనతో బిజెపి అధికారాన్ని చేపట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్య బలం లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు పట్టుబట్టడం వారి నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. తమకు దక్కిన బూటకపు విజయంపై బిజేపినేతలు అదేదో న్యాయబద్ధమైన గెలుపుగా భావించి సంబరాలు చేసుకుంటున్నారని, వారి సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. మోడీ పాలనలో రాష్ట్రాలు అల్లల్లాడుతున్నాయని, త్వరలోనే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పి ఆ పార్టీని ఇంటికి పంపించేయడం ఖాయమని, అందుకు ఆ పార్టీనేతలు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు……