ఏపికి చాలా చేశాం..ఈ లెవెల్లో ఏ రాష్ట్రానికి చేయలేదు: బిజెపి నేత

Saturday, March 3rd, 2018, 12:27:17 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నేతలు కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. స్పెషల్ ప్యాకేజ్ – ప్రత్యేక హోదా అంటూ నేతలు రాష్ట్రము విడిపోయినప్పటి నుంచి బీజేపీ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు మోడీతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడంతో తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారని అనుకున్నారు. కానీ బడ్జెట్ పేజీలలో ఏపీకి కనీసం రెండు పేపర్లు అయినా దక్కలేదు. అరుణ్ జైట్లీ ఎదో గుర్తు చేసుకున్నట్లు మాత్రమే సభలో వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ తీరువల్ల ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అందరి నుంచి డిమాండ్ పెరుగుతోంది. అయితే ఏపీ బీజేపీ నాయకులు మాత్రం రివర్స్ లో రావడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి బీజేపీ చాలా చేసిందని, ఈ స్థాయిలో ఏ రాష్ట్రానికి సహాయపడలేదు అని ఏపి బిజెపి నేతలు అంటున్నారు. రీసెంట్ గా విజయవాడలో కృష్ణా జిల్లా- విజయవాడ నగర భాజపా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిధిగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిని బీజేపీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. కాంగ్రెస్ వల్లే రాష్ట్రం చాలా నష్టపోయింది.

ఇప్పుడు ఆ పార్టీ వారు ప్రత్యేక హోదా అనడం విడ్డురంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీజేపీ ఏ రాష్ట్రానికి చేయనంత సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ కు చేసింది. కావాలంటే పరిశోధన చేసి ఎవరైనా నిజా నిజాలు తెలుసుకోవచ్చు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్రం చాలా సక్రమంగా నిర్వహిస్తోంది. అందులో లేని అంశాలను కూడా బీజేపీ చేర్చి సహాయపడుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం అనవసరంగా విమర్శలు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పని చేయకుండా తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రత్యేక హోదాపై సంతకం చేయిస్తామని చెప్పడం ప్రజల్ని మోసం చేయడం లాంటిదని హరిబాబు తెలిపారు. ఇక బీజేపీ ఆలోచన తీరును ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తల్లో ఉందని తెలిపారు.