కెసిఆర్,కవితలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..!

Friday, October 5th, 2018, 01:20:40 PM IST

తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న నిజామాబాద్ లో జరిగినటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ నాయకత్వం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే.ఇప్పుడు కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యల్లో అసలు ఎలాంటి నిజం లేదంటూ కెసిఆర్ కి ఆయన కూతురు ఎంపీ కవితకు ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువయ్యిపోయిందని తెలంగాణా బీజేపీ నేత అరవింద్ ధర్మపురి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కెసిఆర్ నిజామాబాద్ వచ్చినప్పుడు అక్కడి స్థానిక సమస్యలు కోసం మాట్లాడకుండా ఉత్త కుమార్ రెడ్డి ని తిట్టడానికి నిజామాబాద్ రావడం ఎందుకని ప్రశ్నించారు.ఒక రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నటువంటి కెసిఆర్ ఇతర పార్టీల వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సంస్కార హీనంగా మాట్లాడ్డం ఏమిటని ప్రశ్నించారు.తెరాస మ్యానిఫెస్టోలోని ఒక్క పథకాన్ని కూడా అమలు చెయ్యని కెసిఆర్ ఇప్పుడు బీజేపీ పార్టీ యొక్క మ్యానిఫెస్టో గురించి మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

నిన్న సభలో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసి ప్రతీ ఒక్కరి అకౌంటులో 15 లక్షలు వేస్తానన్నారన్న మాటలకు గాను అసలు నరేంద్ర మోడీ ఆ మాటలను ఎప్పుడన్నారని,ఆ వీడియో క్లిప్పింగులు ఎమన్నా ఉంటే బయట పెట్టాలని కెసిఆర్ కు ఈ మధ్య విపరీతంగా మతిమరుపును ఎక్కువయ్యిపోతుందని,ఒక మంచి డాక్టరుకి చూపించుకోవాలని సూచించారు,అదే సమయంలో ఎంపీ కవిత గారి కోసం కూడా మాట్లాడుతూ నిజామాబాదుకు 292 ప్రాజెక్టులు,12 వేల ఉద్యోగాలు ఇచ్చేశాం అని అబద్దాలు చెప్తున్నారని,వాటి తాలూకా జాబితాను ఒకసారి విడుదల చేసి చూపించండి అని ప్రశ్నించారు.నీకు కూడా మీ నాన్న లాగే మతిమరుపు వచ్చిందా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.