చంద్రబాబుకు ఇక చుక్కలే : బీజేపీ సోమువీర్రాజు

Saturday, April 21st, 2018, 12:16:22 PM IST

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సాక్షిగా పెట్టమని కోరుతున్నామన్నారు. ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతున్నపుడు చంద్రబాబు నవ్వుతున్నారని ఆయన గుర్తుచేశారు. బాబు ప్రభుత్వం గాడి తప్పినట్టుందన్నారు. బాలకృష్ణ ఉపయోగించిన భాషను ఎవరు వాడుతారని ప్రశ్నించారు.

సీఎం వేదికపై ఉండగా బాలకృష్ణ మాట్లాడిన తీరును వర్ణించడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని వీర్రాజు అ‍న్నారు. 2019లో ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఇపుడే కనపడుతోందని.. అందుకే ఆయన లయ తప్పి మాట్లాడుతున్నారన్నారు. ఏ రకంగా రూ. 30 కోట్లను దీక్ష కోసం చంద్రబాబు ఖర్చు చేస్తారని నిలదీశారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కు టీడీపీకి అలవాటైపోయిందన్నారు. అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

  •  
  •  
  •  
  •  

Comments