ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ నాయకుడి దారుణ హత్య…

Wednesday, March 28th, 2018, 12:41:06 AM IST

అధికారంలో ఉన్న జాతీయ రాజకీయ పార్టీ సభ్యులు అన్న భయం కూడా లేకుండా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భోపాలపట్నంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్ కొండర హత్యకు గురైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు పాల్పడినది ఎవరన్నది విచారణ చేపట్టగా ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం, మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధికి సుమారు 300 మీటర్ల దూరంలోనే జగదీష్ రహస్య హత్యకు గురయ్యారు. అయితే జగదీష్‌ని ఎవరైన పాతకక్షలతో హత్య చేశారా..? లేక మావోయిస్టులే కేంద్రం పైన ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా..? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై బీజాపూర్ జిల్లా ఎస్పీ దృవ్‌ని వివరణ కోరగా జగదీష్ హత్యకు గురైన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. ఇది మావోయిస్టులు చేసిన పని అని ఇంకా నిర్ధారించలేదని ఆయన తెలిపారు. వీలైనంత త్వరలో జరిగిన హత్యకు అసలైన కారణం తెలుసుకొని హంతకులను కూడా పట్టుకొని శిక్ష పడే విధంగా చూస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.