టీడీపీ వాదనకు చెక్ పెట్టిన బీజేపీ నేతలు !

Sunday, February 11th, 2018, 12:22:58 PM IST

ఇటీవల కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం జరిగిందని, పలువురు నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఈ విషయమై రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేసిన విషయం కూడా విదితమే. ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్త ప్రతిపక్షాలన్నీ ఏపీకి జరిగిన అన్యాయంపై ఒక రోజు బంద్ పాటించాయి. అయితే ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదని, ఏపీకి కేంద్రం నుంచి సాయం అందడం లేదన్న టీడీపీ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. ఈ విషయమై ఎంపీ హరిబాబు మాట్లాడుతూ అవి టిడిపి నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలని, గత నాలుగేళ్లుగా ఏపీకి చేసిన సాయంపై ఆయన 27 పేజీల ఒక నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు. దీంతో టీడీపీ వాదనలకు గణాంకాలతో చెక్ పెట ప్రయత్నం చేశారు. పొత్తులపై తేల్చుకోవాల్సింది టీడీపీయేనని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు కేంద్రం రాష్ట్రానికి కేటాయించి నిధులు లెక్కలు చెప్పారు.

రెవెన్యూ లోటు కింద రూ.3975 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.1050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.4662.28 కోట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.135 కోట్లు, జాతీయ విద్యా సంస్థలకు రెండేళ్లలో రూ.541.47 కోట్లు, ఎయిమ్స్‌కు రూ.54.51 కోట్లు ఇచ్చామని, మొత్తం ఇప్పటివరకు విభజన చట్టం ప్రకారం ఇచ్చింది రూ.12,918.26 కోట్లు అని అన్నారు. ఏపీకి ఎన్నడూ లేనంత సాయం చేశామన్నారు. అలాగే ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నామని, విభజన చట్టంలోని హామీలన్నీ పదేళ్లలో అమలు చేయాలని ఉన్నా తాము ఇప్పటికే మూడున్నరేళ్లలో 85 శాతం పూర్తి చేశామని చెపుకొచ్చారు. రాష్ట్రానికి ఇంత సాయం చేసినా, ఇన్ని నిధులు ఇచ్చినా, వాటి లెక్కలు చూపకుండా నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ విమర్శించడం సరికాదని బీజేపీ ఇతర నాయకులు సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహా రావు, కన్నా లక్ష్మీనారాయణలు మండిపడ్డారు. మొన్నటి వరకు మొనంగా ఉండి, ఇప్పుడు యాగీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబే తమ పార్టీ ని రాష్ట్రం లో నామరూపాలు లేకుండా చేయడానికి సన్నద్దమయ్యారని, ఇప్పటికైనా వాస్తవాలను చంద్రబాబు ప్రజల ముందు పెట్టాలని దుయ్యపట్టారు….

  •  
  •  
  •  
  •  

Comments