బీజేపీ ఒంటరిదయిపోయిందా..? ఏమంటారు అమిత్ జీ..!

Monday, April 9th, 2018, 09:02:04 AM IST

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మిత్రపక్షాల్లో పునరాలోచన మొదలైంది. ఇప్పటికే శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగుతామని ప్రకటించగా, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుంటే కూటమిలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామని యూపీ మంత్రి, ఎస్బీఎస్పీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తేల్చేశారు. కాగా, ఏపీలో అధికార టీడీపీ.. ఎన్డీయేకు దూరమైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా తమ వ్యూహంలో మార్పు లేదని ఆ పార్టీ తేల్చేసింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న వ్యూహంలో ఏ మార్పు లేదని ఆదివారం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిసి పని చేస్తున్నా తరుచుగా కేంద్ర ప్రభుత్వ విధానాలను శివసేన ప్రశ్నిస్తున్నది. ఈ నెల ఆరో తేదీన ముంబైలో బీజేపీ అధ్యక్షుడు అమి త్ షా మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన ఎన్డీయేలోనే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వారు (శివసేన) ప్రస్తుతం మాతో ప్రభుత్వంలో కలిసి ఉన్నా రు. వా రు మాతో కలిసి ఉండాలన్నది మా బలమైన ఆకాం క్ష అని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోమని, ఒంటరి పోరుకు దిగుతామని శివసేన గత జనవరిలో ప్రకటించింది. శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయి శనివారం రాత్రి ఠాణెలో జరిగిన సభలో మాట్లాడుతూ ఆరు నెలలుగా బీజేపీ స్వరం మారిందని, ఎన్డీఏ మిత్ర పక్షాల గురించి మాట్లాడుతున్నదన్నారు. మరో శివసేన నాయకుడు మాట్లాడుతూ బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం మిత్రపక్షాలను వాడుకుని వదిలేస్తుందని ఆరోపించారు. మరోవైపు యూపీ క్యాబినెట్ మంత్రి, ఎస్బీఎస్పీ నేత ఓం ప్ర కాశ్ రాజ్‌భర్ తమను సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ల క్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

సంకీర్ణ ధర్మం పాటించడం లేదని ఆదివారం మీడియాతో చెప్పా రు. ఈ నెల 10న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. తాము లేవనెత్తే అంశాలను అమిత్ షా అంగీకరించకుంటే కూటమిలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామన్నారు. ప్రభుత్వంలో అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి స్పందిస్తూ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కేవలం మీడియా కోసమే బీజేపీపై ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు.